బ్రిటన్ ప్రధాని అధికార నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి!
- ఇటీవల లండన్‌లో వెలుగు చూసిన ఘటన
- ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్న ప్రధాని రిషి
- సమాచారం తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయిన వైనం
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభం
లండన్, 10 డౌనింగ్ స్ట్రీట్ లోని బ్రిటన్ ప్రధాని అధికార నివాసం గేట్లను తాజాగా ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. ఘటన జరిగిన సమయంలో ప్రధాని రిషి సునాక్ తన ఆఫీసులోనే ఉన్నారు. విషయం తెలిసిన ఆయన తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ మేరకు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సాయంత్రం 4.20 గంటల సమయంలో నిందితుడు తన కారుతో గేట్లను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుడిపై నేరపూరితంగా ఆస్తినష్టం కలిగించడం, ప్రమాదకరంగా వాహనం నడపడం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగాక కొంత సేపు ప్రధాని కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు ఆ తరువాత సడలింపులు ప్రకటించారు. తెల్ల జుట్టు ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు జైలుకు తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అమెరికాలోనూ ఇటీవల ఇలాంటి ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపేస్తానంటూ సాయి వర్షిత్ అనే భారతీయ సంతతి యువకుడు పెద్ద ట్రక్ తోలుకుంటూ అధ్యక్ష నివాసం వైట్‌హౌస్ పరిసరాల్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడున్న బారికేడ్లు ధ్వంసం చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో నిందితుడికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది.