సంబరాల్లో చెమటలు కక్కుతున్న నేతలు అధికారులు …
-సంబరాలు సరే మాపని అయిపోతుందంటున్న వైనం
-21 రోజుల కార్యక్రమాలు …రోజుకో డిపార్ట్మెంట్
-జిల్లా ఉన్నతాధికారులకు, నాయకులకు రోజు కార్యక్రమాలే
-నియోజకవర్గాల్లో తిరగాలని ఎమ్మెల్యేలకు ఎంపీలకు కేసీఆర్ ఆదేశాలు
-తిరక్కపోతే సీటు రాదనే ఉద్దేశంతో నాయకుల ఉరుకులు పరుగులు
అసలే రోహిణి కార్తె ….రోళ్ళు పగిలే ఎండలు …నిప్పులు కక్కుతున్న భానుడు 44 నుంచి 46 డీగ్రీలవరకు ఉష్టోగ్రతలు …ఈసమయంలోనే వచ్చిన తెలంగాణ సంబరాలు అటు రాజకీయ నాయకులను ఇటు అధికారాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైగా ఇది ఎన్నికల సంవత్సరం… ప్రజల్లో లేకపోతె ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ఎమ్మెల్యేలు…. 21 రోజులు సంబరాల్లో పాల్గొనకపోతే తమకు అధినేత దగ్గర మైనస్ మార్కులు పడతాయని పరుగులు తీస్తున్నారు . వీరితోపాటు అధికారులు సైతం హైరానా పడుతున్నారు . ఒక్కోరోజు ఒక డిపార్ట్మెంట్ వారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ధాన్యం కొనిగొలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు . కల్లలలో ఉన్న ధాన్యం కొనుగోలుకు నోచుకోక రైతులు నానా ఇక్కట్లకు గురౌతున్నారు .ఇదేమని అడిగితె అధికారుల నుంచి సరైన సమాధానం లేక తెచ్చిన ధాన్యం నెలల తరబడి రోడ్డులపై ఉండటంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు . ఇదే సందర్భంలో వచ్చిన దశాబ్ది సంబరాలకు వచ్చిన ప్రజాప్రతినిధులను రైతులు నిలదీస్తున్నారు.
రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆదివారం నేలకొండపల్లి మండలంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని రైతులు నిలదీశారు . కల్లాల లో ఉన్న ధాన్యం , మొక్కజొన్నలు కాటాలు వేయడంలేదు . రోజుల తరబడి ఎండకు వెండి వానకు తడిసి ఉంటున్నాయి. తరుగు 10 కేజీలు తీస్తున్నారు .రైతు బంధు ఇస్తున్నామని చెప్పి ఎకరాకు మాకు 10 వేలు ఇస్తూ 16 వేలు రూపాయలు నష్టపరుస్తున్నారు . ఇదేనా రైతులకు మీరు చేసే మేలు అంటూ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు . అంతే కాకుండా పెర్టిలైజర్ , పెర్టిసైడ్స్ రేట్లు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడుతున్నారు . గిట్టుబాటు ధర లేదు అంటూ ప్రభుత్వం పై తమ వ్యతిరేకతను వారు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రమంతా ఇదే తీరు కనిపిస్తుంది. అటు కౌశిక్ రెడ్డి కూడా రైతులనుంచి నిరసన ఎదుర్కొన్నారు . కొందరు ఎమ్మెల్యేలు ఏమి చెప్పలేక జారుకుంటుండగా మరికొందరు . రైతులతో వాగ్వివాదానికి దిగుతున్నారు .
ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వరంలో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు . అధికార పార్టీ కార్యక్రమాలుగా అవి మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి . బీఆర్ యస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరు పాల్గొనడంలేదు . పోలీస్ శాఖ నిర్వహించిన కార్యక్రమాల్లో అధికార పార్టీకి మాత్రమే వారు పోలీసులుగా ఉంటున్నారని సామాన్యప్రజలకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే న్యాయం జరగటం లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
రోడ్డెక్కిన విద్యుత్ వినియోగదారులు
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి దినోత్సవం రోజునే విద్యుత్ వినియోగదారులు ఆందోళన చేశారు. వైరా సంత బజారులో ఈనెల 2వ తేదీ రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ ఉన్న 100 కే.వి ట్రాన్స్ఫార్మర్పై లోడు పడటంతో అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ నుంచి పొగలు వచ్చి విద్యుత్ సరఫరా బ్రేక్ అయింది. ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో వినియోగదారులు బస్టాండ్ సెంటర్లోని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. గత మూడు రోజులుగా తమ ప్రాంతంలో విద్యుత్ లేకపోయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఎండ వేడిమికి కరెంట్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డామని తెలిపారు.