రాచరికపు రోజులను గుర్తికు తెస్తున్నకేసీఆర్… మహారాష్ట్రకు కేసీఆర్ ర్యాలీ దండయాత్రల ఉందనే విమర్శలు …
-ఆలయంలో పూజలు చేయడం కోసం పక్క రాష్ట్ర సీఎం వస్తే అభ్యంతరం లేదన్న శరద్ పవార్
-బలప్రదర్శన చేసేలా భారీ కాన్వాయ్ తో రావడం ఆందోళనకరమని వ్యాఖ్య
-భగీరథ్ బీఆర్ఎస్ లో చేరడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్న ఎన్సీపీ చీఫ్
మహారాష్ట్రలో పాగా వేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆయన 600 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లారు. పూర్తి స్థాయిలో కేసీఆర్ బలప్రదర్శన చేశారు. తన పర్యటనలో పండరిపురంలోని విఠల్ రుక్మిణి ఆలయాన్ని దర్శించుకున్నారు. మరోవైపు భారీ కాన్వాయ్ తో కేసీఆర్ వెళ్లడంపై మరాఠా యోధుడిగా పేరుగాంచిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఆలయంలో పూజలు చేసుకోవడానికి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఎలాంటి అభ్యంతరం లేదని శరద్ పవార్ అన్నారు. అయితే వందలాది వాహనాలతో బలప్రదర్శన చేసేలా రావడం మాత్రం ఆందోళనకరమని చెప్పారు. కేసీఆర్ తన పర్యటనలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం కోసం ప్రయత్నించి ఉంటే బాగుండేదని అన్నారు.
2021 అసెంబ్లీ బైపోల్స్ లో ఎన్సీపీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన భగీరథ్ భాల్కే నిన్నటి సభలో బీఆర్ఎస్ లో చేరడంపై పవార్ స్పందిస్తూ… పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా ఎలాంటి నష్టం లేదని చెప్పారు. భగీరథ్ కు టికెట్ ఇచ్చిన తర్వాత తమ నిర్ణయం తప్పని అనిపించిందని అన్నారు. ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు.