తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు …
నిండుకుండలా ప్రాజెక్టులు …ఉట్టిపడుతున్న జలకళ
హైదరాబాద్‌లో పలుచోట్ల ఉరుములతో భారీ వర్షం
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక
అప్రమత్తమైన అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది
హైదరాబాద్-విజయవాడ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా ప్రారంభమైయ్యాయి. అయినప్పటికీ జులై నెల చివరిలో దంచి కొడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు అన్ని నిండుకుండలా తలపిస్తున్నాయి. రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. తెలంగాణ అంతటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైద్రాబాద్ నగరం రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ముద్దయింది .పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి.
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకొని, ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల పాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 040-21111111, 9000113667కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్ లో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది.
కొండాపూర్, మాదాపూర్, సికింద్రాబాద్, గచ్చిబౌలి, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, తార్నాక, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, బోయినపల్లి, బేగంపేట, రామ్ నగర్, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హైదరాబాద్ – విజయవాడ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. అబ్దుల్లాపూర్ మెట్ నుండి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలో ద్విచక్రవాహనదారులు వంతెనల కింద తలదాచుకున్నారు.