2023 వరకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ బుకింగ్స్ ఫుల్… వెయిటింగ్ లిస్టులో భారత్!
- భారత్ లో టీకాలకు విపరీతమైన డిమాండ్
- ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ పంపిణీ
- మోడెర్నా, ఫైజర్ కంపెనీల వైపు కేంద్రం చూపు
- గతంలో ఫైజర్ దరఖాస్తు తిరస్కరించిన కేంద్రం
- అనేక దేశాలకు టీకాలు సరఫరా చేస్తున్న ఫైజర్
భారత్ లో టీకాల కొరత ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో విదేశీ టీకాలపైనా భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే కేంద్రం ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడడంతో, భారత్ లో 2023 వరకు ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఇప్పటివరకు బుక్ చేసుకున్న దేశాలకు టీకాలు సరఫరా చేసేందుకే ఫైజర్, మోడెర్నాలకు మరో రెండేళ్లు పట్టనుంది.
ఒక రకంగా భారత్ మంచి అవకాశాన్ని చేజార్చుకుందని చెప్పాలి. ఫైజర్ సంస్థ తన టీకాకు అత్యవసర అనుమతుల కోసం గతంలోనే భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఫైజర్ టీకా ఎం-ఆర్ఎన్ఏ కేటగిరీకి చెందినదంటూ నిపుణుల కమిటీ దాన్ని తిరస్కరించింది. దాంతో ఫైజర్ మరోసారి దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.
అయితే, గతకొన్ని నెలలుగా దేశంలో సెకండ్ వేవ్ తీవ్రతరం కావడంతో విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం పంథా మార్చుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన, ఇతర దేశాల్లో వినియోగంలో ఉన్న వ్యాక్సిన్లకు భారత్ లో 2, 3వ దశ క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదని ప్రకటన చేసింది. కానీ, అప్పటికే ఆలస్యం అయింది. ఫైజర్, మోడెర్నా సంస్థల వ్యాక్సిన్ల కోసం అనేక దేశాలు ఒప్పందాలు చేసుకోవడంతో భారత్ వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.