- 543 స్థానాలకు గాను ఎన్డీయే 318 సీట్లను కైవసం చేసుకుంటుందన్న సర్వే
- ఇండియా కూటమికి 175 సీట్లు వస్తాయని వెల్లడి
- తగ్గనున్న బీజేపీ సీట్లు.. పెరగనున్న కాంగ్రెస్ స్థానాలు
వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, విపక్షాల ఇండియా కూటమి గట్టి పట్టుదలతో ఉన్నాయి. మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ సర్వే ఆసక్తికర అంచనాలను వెలువరించింది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే 543 లోక్ సభ స్థానాలకు గాను ఎన్డీయే 318 సీట్లను గెలుచుకుని క్లియర్ మెజార్టీ సాధిస్తుందని తెలిపింది. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 175 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. ఇతర ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు 50 స్థానాల వరకు గెలుపొందుతారని చెప్పింది. అయితే లోక్ సభలో బీజేపీ సభ్యుల సంఖ్య 303 నుంచి 290కి తగ్గుతుందని పోల్ సర్వే తెలిపింది. ఇదే సమయంలో కాంగ్రెస్ సీట్లు కొంత మేర పెరుగుతాయని… ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న బలం 52 సీట్ల నుంచి 66 సీట్లకు పెరుగుతుందని చెప్పింది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లతో లోక్ సభలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన (యూబీటీ) బలాన్ని పెంచుకుంటుందని సర్వే వెల్లడించింది. ఉద్ధవ్ పార్టీ బలం ప్రస్తుతం ఉన్న 6 సీట్ల నుంచి 11 సీట్లకు పెరుగుతుందని చెప్పింది. ఇదే సమయంలో శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండే పార్టీ సీట్లు 12 నుంచి 2కి పడిపోతాయని అంచనా వేసింది. ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ పార్టీ బిజు జనతాదళ్ ఒక్క స్థానాన్ని పెంచుకుని 12 నుంచి 13కు పెరుగుతుందని తెలిపింది. ఆప్ కు మరో సీటు పెరగబోతోందని పోల్ వెల్లడించింది. గుజరాత్ లోని మొత్తం 26 సీట్లను, ఉత్తరాఖండ్ లోని మొత్తం 5 స్థానాలను బీజేపీ స్వీప్ చేస్తుందని సర్వే తెలిపింది. ఇక కర్ణాటక విషయానికి వస్తే బీజేపీ మళ్లీ పుంజుకుంటుందని చెప్పింది. ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహిస్తే మొత్తం 28 స్థానాల్లో 20 సీట్లను గెలుచుకుంటుందని తెలిపింది. కేరళలో ఇండియా కూటమి మొత్తం 20 స్థానాలకు కైవసం చేసుకుంటుందని తెలిపింది.
రాష్ట్రాల వారీగా బ్రేకప్:
- ఉత్తరప్రదేశ్ (80): NDA 73, INDIA 7
- బీహార్ (40): NDA 24, INDIA 16
- మహారాష్ట్ర (48): NDA 24, INDIA 24
- తమిళనాడు (39): NDA 9 INDIA 30
- పశ్చిమబెంగాల్ (42): NDA 12, INDIA 30
- కర్ణాటక (28): NDA 20, INDIA 7, Others 1
- గుజరాత్ (26): NDA 26, INDIA 0
- కేరళ (20): NDA 0 , INDIA 20
- రాజస్థాన్ (25): NDA 21, INDIA 4
- ఆంధ్రప్రదేశ్ (25): NDA 0, INDIA 0, Others 25
- ఒడిశా (21): NDA 8, INDIA 0, Others 13
- మధ్యప్రదేశ్ (29): NDA 24, INDIA 5
- తెలంగాణ (17): NDA 6, INDIA 2, Others 9
- అసోం (14): NDA 12, INDIA 1, Others 1
- ఛత్తీస్ గఢ్ (11): NDA 7, INDIA 4
- జార్ఖండ్ (14): NDA 13, INDIA 1
- హర్యానా (10): NDA 8, INDIA 2
- పంజాబ్ (13): NDA 0, INDIA 13
- ఢిల్లీ (7): NDA 5, INDIA 2
- ఉత్తరాఖండ్ (5): NDA 5, INDIA 0
- జమ్మూకశ్మీర్, లడఖ్ (6): NDA 3, INDIA 2, Others 1
- హిమాచల్ ప్రదేశ్ (4): NDA 3, INDIA 1
- మణిపూర్ (2): NDA 0, INDIA 2
- ఇతర ఈశాన్య రాష్ట్రాలు (9): NDA 9, INDIA 0
- గోవా (2): NDA 2 , INDIA 0
- లడఖ్ మినహా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు (6): NDA 4, INDIA 2
- మొత్తం 543 స్థానాలు, NDA 318, INDIA 175, OTHERS 50