- తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన
- కళాశాలలో ప్రేమించుకున్న యువతీయువకులు, ఏడేళ్ల తరువాత విభేదాలతో విడిపోయిన వైనం
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడికి మరో టెకీతో వివాహం
- అతడిని మర్చిపోలేనంటూ తల్లిదండ్రులకు తెగేసి చెప్పిన యువతి
- వారి సాయంతో యువకుడి కిడ్నాప్, గుళ్లో బలవంతంగా పెళ్లి
- యువకుడి భార్య ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రియుడికి పెళ్లయిందని తెలిసీ అతడిని మర్చిపోలేకపోయిన ఓ యువతి అతడిని కిడ్నాప్ చేసి మరీ బలవంతంగా వివాహమాడింది. తమిళనాడు రాజధాని చెన్నైలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. వేళచ్చేరికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పార్తిబన్, రాణిపేటకు చెందిన సౌందర్య కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల పాటు కొనసాగిన వారి బంధం చివరకు విబేధాల కారణంగా తెగిపోయింది.
కాగా, పార్తిబన్ గత నెల 5న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసి షాకయిపోయిన సౌందర్య అతడిని మర్చిపోలేనని తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది. పార్తిబన్‌నే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. దీంతో, యువతి తల్లి ఉమ, తన బంధువులు రమేష్, శివకుమార్‌లతో కలిసి శుక్రవారం పార్తిబన్‌ను అపహరించింది. ఆఫీసు నుంచి తిరిగొస్తున్న అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వారు కాంచీపురానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ ఆలయంలో అతడితో సౌందర్యకు బలవంతంగా తాళి కట్టించారు.
పార్తిబన్‌ను కిడ్నాప్ చేశారని తెలిసి అతడి భార్య పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు యువతితో పాటు ఆమె తల్లి, అపహరణతో ప్రమేయం ఉన్న ఇతర బంధువులను అదుపులోకి తీసుకున్నారు.