Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

 తండ్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జగన్, షర్మిల భావోద్వేగం

  • మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది నాన్నా అంటూ జగన్ ట్వీట్
  • వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన షర్మిల, విజయమ్మ
  • 14 ఏళ్లు పూర్తయినా ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నారన్న షర్మిల

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తమ తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్‌ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో మీ ఆశయాలే నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా’ అని జగన్ ట్వీట్ చేశారు. 

మరోవైపు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, ఆమె తల్లి విజయమ్మ నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడుతూ… మహానేత మన నుంచి వెళ్లిపోయి 14 ఏళ్లు పూర్తయినా ప్రజల గుండెల్లో ఆయన ఇంకా నిలిచే ఉన్నారని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్సార్ దే నని చెప్పారు.

రైతులకు రుణమాఫీ చేయడం, మహిళలకు పావలా వడ్డీకి రుణం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, 46 లక్షల ఇళ్లను నిర్మించడం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన చేపట్టారని అన్నారు. మన మధ్య ఆయన లేకపోవడం తీరని లోటు అని చెప్పారు. ఆయన చనిపోయినప్పుడు బాధను తట్టుకోలేక దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారని… వారి కుటుంబ సభ్యులకు రాజన్న బిడ్డ శిరస్సు వంచి నమస్కరిస్తోందని అన్నారు. మీడియా ప్రజల పక్షాన నిలబడాలని, ప్రజల గొంతును వినిపించాలని కోరారు.

Related posts

పదకొండేళ్ల చిన్నారికి గుండె మార్పిడి

Ram Narayana

ఆసక్తికర పరిణామం …తెలంగాణాలో టికెట్ ఆశిస్తున్నా వ్యక్తికీ ఆంధ్రాలో టికెట్

Ram Narayana

వరదబాధితులను ఆదుకోండి …అమిత్ షాకు బీజేపీనేత డాక్టర్ సుధాకర్ రెడ్డి వినతి !

Ram Narayana

Leave a Comment