- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయమన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- ఇండియా కూటమి విజయం సాధించి రాహుల్ ప్రధాని అవుతారని జోస్యం
- కేసీఆర్‌ను గద్దెదింపుదామని పొంగులేటి పిలుపు
మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, గరిడేపల్లి పాలకవీడు మండలాల్లో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి విజయంతో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఉత్తమ్ పేర్కొన్నారు.
మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు కాంగ్రెస్’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దెదింపి కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంతోపాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీకి చెందిన 35 కుటుంబాలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి.