- స్టేషన్ ఘనపూర్‌కు ఉపఎన్నిక రాదు… వచ్చినా సిద్ధమేనన్న కడియం
- ఫిరాయింపులను తొలుత ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని విమర్శ
- ఉపఎన్నిక వస్తే బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్య
వరంగల్ చరిత్రను కనుమరుగు చేయడానికే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ముక్కలు చేశారని, దీనిపై తాను ప్రశ్నించినందుకు తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్‌కు ఉప ఎన్నికలు రావని… ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు.
జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్టేషన్ ఘనపూర్‌కు ఉపఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఫిరాయింపులను తొలుత ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్‌ది విమర్శించారు.
ఉపఎన్నిక వస్తే బీఆర్ఎస్‌కు స్టేషన్ ఘనపూర్‌లో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. కోర్టులపై, ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని విమర్శించారు.
స్టేషన్ ఘనపూర్‌కు త్వరలో ఉపఎన్నిక వస్తుందని, పార్టీ నుంచి తాటికొండ రాజయ్య విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరి పైవిధంగా స్పందించారు.