- తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టీకరణ
- కొన్ని చానెళ్లలో పొత్తుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడి
- భావ సారూప్య శక్తులెవరైనా కలిసొస్తే కలుపుకొని పోతామన్న ఆర్ఎస్పీ
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. బీఎస్పీ ఒంటరిగానే రానున్న ఎన్నికల బరిలో దిగబోతుందని స్పష్టం చేశారు. పొత్తుల గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్ అన్నారు.
‘కొన్ని చానళ్లలో పొత్తుల గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. అది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. మా అధినేత్రి మాయావతి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మే 7వ తేదీ నాడు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో చేసిన ప్రకటనే మాకు శిరోధార్యం. దొరల గడీల పాలనను అంతమొందించి, తెలంగాణలో బహుజన రాజ్య స్థాపనే మా అంతిమ లక్ష్యం. ఈ క్రమంలో భావ సారూప్య శక్తులెవరైనా కలిసొస్తే కలుపుకొని పోరాడతాం’ అని ప్రవీణ్ ట్వీట్ చేశారు.