Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

కుల్దీప్ స్పిన్ ఉచ్చులో పాక్ విలవిల… 228 పరుగులతో భారత్ ఘనవిజయం

  • ఆసియా కప్ లో సూపర్-4 మ్యాచ్
  • కొలంబోలో భారత్ × పాకిస్థాన్
  • 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు చేసిన భారత్
  • కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలు
  • లక్ష్యఛేదనలో 32 ఓవర్లలో 128 పరుగులు చేసిన పాక్
  • కుల్దీప్ యాదవ్ కు 5 వికెట్లు

ఇటీవల కాలంలో పాకిస్థాన్ జట్టు ఆట పరంగా ఎంతో మెరుగైందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, ఆసియా కప్ లో భారత్ జోరు ముందు పాక్ నిలవలేకపోయింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించినప్పటికీ సడలని ఏకాగ్రతతో ఆడిన భారత్… అన్ని రంగాల్లో పాక్ ను దెబ్బకొట్టింది. 228 పరుగుల భారీ తేడాతో దాయాదిని చిత్తుగా ఓడించింది. 

వాస్తవానికి ఈ మ్యాచ్ నిన్ననే జరగాల్సింది. వర్షం కారణంగా ఇవాళ రిజర్వ్ డేలో కొనసాగించాల్సి వచ్చింది. ఈ సూపర్-4 సమరంలో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. అది ఎంత పొరపాటు  నిర్ణయమో భారత్ బ్యాటింగ్ జోరు చూస్తేనే అర్థమవుతుంది. టాపార్డర్ రాణింపుతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 2 వికెట్లకు 356 పరుగులు చేసి పాక్ కు సవాల్ విసిరింది. అయితే ఛేదనలో పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది.

అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ (56), శుభ్ మాన్ గిల్ (58) తొలి వికెట్ కు 121 పరుగులు జోడించి బలమైన పునాది వేయగా, ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడీ పాక్ బౌలింగ్ ను ఊచకోత కోసింది. ఈ జోడీ మూడో వికెట్ కు అజేయంగా 233 పరుగులు జోడించే క్రమంలో సెంచరీలతో కదం తొక్కింది. కోహ్లీ 122, కేఎల్ రాహుల్ 111 పరుగులు చేశారు. 

లక్ష్యఛేదనలో పాక్ ను భారత బౌలర్లు కకావికలం చేశారు. ముఖ్యంగా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. చివర్లో నసీమ్ షా, హరీస్ రవూఫ్ గాయాల కారణంగా బ్యాటింగ్ కు దిగలేదు. 8 వికెట్లు పడిన తర్వాత పాక్ ఆలౌట్ అయినట్టు ప్రకటించారు. బుమ్రా 1, పాండ్యా 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో భారత్ ఆసియా కప్ సూపర్-4 దశలో అగ్రస్థానానికి చేరింది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను శ్రీలంకతో రేపు (సెప్టెంబరు 12) ఆడనుంది.

Related posts

ఐపీఎల్ నిలిచిపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఆస్ట్రేలియన్లు!

Drukpadam

రవిశాస్త్రిపై రహానే తీవ్ర విమర్శలు…

Drukpadam

ఆసియా కప్ ఫైనల్ కు చేరాలంటే.. భారత్ ముందున్న అవకాశాలు ఇవీ..!

Drukpadam

Leave a Comment