- దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
- నిన్న రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేసిన ఉపరాష్ట్రపతి
- ఈ రోజు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో చట్టంగా రూపుదాల్చింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించవలసి ఉంటుంది.
నిన్న గురువారం రోజు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఈ 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 111వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. నేడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుకు మజ్లిస్ పార్టీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.