- తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారన్న ప్రియాంక
- గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిర ఎంతో చేశారని వ్యాఖ్య
- ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా
తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆదివారం ఖానాపూర్ కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని, అందుకే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ఇందిరాగాంధీ మరణించి 40 ఏళ్లైనా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. ఆమె చేసిన పనుల వల్ల ప్రజలు ఆరాధిస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ సంస్కృతి ప్రపంచంలోనే అత్యున్నతమైనది అన్నారు. గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి చేశారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చినా… కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లయినా ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. యువతకు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు.
ఇదిలా ఉండగా, ఈ రోజు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఉండటంతో భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో రికార్డులు సృష్టిస్తోందన్నారు. జీతేగా.. జీతేగా.. ఇండియా జీతేగా అంటూ నినాదాలు చేశారు.