- రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఘటన
- వెంటనే అలెర్ట్ చేసిన ఇతర నేతలు
- తప్పును సరిదిద్దుకున్న మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే పొరపాటు పడ్డారు. రాజీవ్‌గాంధీ పేరుకు బదులు రాహుల్‌గాంధీ పేరును ప్రస్తావించి పెద్ద పొరపాటే చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న అనూప్‌గఢ్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాహుల్‌గాంధీ వంటి నాయకులు దేశ ఐక్యత కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టారు’’ అని పేర్కొన్నారు.
పొరపాటును గ్రహించిన ఇతర నేతలు వెంటనే ఖర్గేకు విషయం చెప్పడంతో ఆయన నాలుక్కరుచుకున్నారు. మళ్లీ వెంటనే తన వ్యాఖ్యలను సరిచేసుకున్నారు. తనను క్షమించాలని, రాజీవ్‌గాంధీ పేరుకు బదులు పొరపాటున రాహుల్‌గాంధీ పేరు ప్రస్తావించానని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ వంటి నేతలు దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పిస్తుంటే.. బీజేపీ నేతలు ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు.
మరోపక్క, మల్లికార్జున ఖర్గే ప్రసంగం వీడియోను ఎక్స్‌లో షేర్ చేస్తూ..‘‘అలా ఎప్పుడు జరిగింది?’’ అని బీజేపీ ప్రశ్నించింది. కాగా, 200 స్థానాలు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీకి ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడవుతాయి.