- రైతుబంధు డబ్బులు వేయడంపై అనుమతిని ఉపసంహరించుకున్న ఈసీ
- హరీశ్ రావు వ్యాఖ్యలే దీనికి కారణమని ఈసీ చెప్పిందన్న రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ వచ్చిన వెంటనే రైతు భరోసా డబ్బులు వేస్తామని హామీ
రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేయడంపై అనుమతిని ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప… నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామ, అల్లుళ్లకు లేదని ఆయన అన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో మీ ఖాతాల్లో రూ. 15 వేల రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పారు.