Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం జగన్,చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ , చిరంజీవి , అభినందనలు…

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం జగన్,చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ , చిరంజీవి , అభినందనలు…
ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలువిజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ
నేడు సీఎంగా పదవీప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం పరిఢవిల్లాలంటూ సీఎం జగన్ స్పందన

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రెండో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ పదవీప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా వ్యవహరించగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై అభినందనల వర్షం కురుస్తోంది.

తాజాగా, ఏపీ సీఎం జగన్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. “తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో ట్విట్ లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు …మెగాస్టార్ చిర్నజీవి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రేవంత్ కు అభినందనలు తెలిపారు ..రేవంత్ తనకు మంచి స్నేహితుడని పవన్ పేర్కొన్నారు …

సీఎంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వాలి: చంద్రబాబు

Chandrababu wishes Revanth Reddy on sworn in as Telangana new chief misnister

తెలుగుదేశం పార్టీతో తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి గతానుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ బంధం వీడింది. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, నేడు సీఎం పదవిని అధిష్ఠించారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్వీట్ లో ఎనుముల రేవంత్ రెడ్డి గారు అంటూ గౌరవంగా సంబోధించారు. 

“తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. తన పదవీకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో రేవంత్ రెడ్డి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Telangana new CM Revanth Reddy

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఈ మధ్యాహ్నం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రేవంత్ కూడా పాల్గొన్నారని, ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. 

“తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాలు… ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో… ఆ ఆశయాలను రేవంత్ ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. జనసేన 8 చోట్ల పోటీ చేయగా, ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా గెలవలేదు. ఎనిమిదిమందిలో ఒక్కరికీ డిపాజిట్ రాలేదు. ఏపీకి సరిహద్దులో ఉండే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 4 చోట్ల పోటీ చేసిన జనసేనకు ఆ నిర్ణయం బెడిసికొట్టింది.

Related posts

ఆమ్రపాలి సహా పలువురు అధికారుల విజ్ఞప్తికి కేంద్రం తిరస్కరణ… ఏపీకి వెళ్లాలని ఆదేశాలు

Ram Narayana

డిప్యూటీ సీఎంకు రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు…

Ram Narayana

అల్లు అర్జున్ విడుద‌ల ఆల‌స్యంపై.. చట్టపరమైన చర్యల యోచ‌న‌లో ఆయన తరఫు న్యాయవాదులు!

Ram Narayana

Leave a Comment