Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

నా కోపం, ఆవేశం ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవి కావు: పవన్ కల్యాణ్

  • నేడు స్వామి వివేకానంద జయంతి
  • మంగళగిరి జనసేన ఆఫీసులో యువజన దినోత్సవ కార్యక్రమం
  • యువతీయువకులను ఉద్దేశించి పవన్ ప్రసంగం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో యువతీయువకులతో సమావేశమయ్యారు. 

ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అధికారంలోకి వచ్చాక యువత గొంతుక అవుతానని ఉద్ఘాటించారు. యువత చెప్పే ప్రతి ఆలోచనను తాను శ్రద్ధగా వింటానని తెలిపారు. అవసరమైతే అన్నీ ఆలోచించి ప్రజా పాలసీగా తీసుకువస్తానని అన్నారు. ఈసారి జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తుందని, వచ్చే ప్రభుత్వంలో జవాబుదారీతనం తీసుకువస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. యువతకు మంచి భవిష్యత్ కల్పించేలా భరోసా ఇస్తామని పేర్కొన్నారు. 

“ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన యువ సమూహమే జనసేన పార్టీకున్న బలం… బలగం. వైసీపీ వంటి నేరపూరిత ఆలోచనలు ఉన్న పార్టీతో పోరాడగలుగుతున్నాను అంటే యువత అండగా ఉండడం వల్లే. యువత నాలో తమను తాము చూసుకుంటారు. దశాబ్దకాలంగా నన్ను అన్ని విధాలా నమ్మిన యువతకు నేను కచ్చితంగా అండగా నిలబడతాను” అని పేర్కొన్నారు. 

యువతరం ఆలోచనలు ఎంతో విస్తృతంగా, విభిన్నంగా ఉంటాయని, నవతరం ప్రతినిధులతో ఎప్పుడు మాట్లాడినా ప్రతిసారి కొత్త ఉత్తేజం కలుగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. దేశం కోసం, సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని వెల్లడించారు. 

సమాజంలో జరిగే విషయాలపై యువతకు ఎంత కోపం ఉంటుందో, తనకు కూడా అంతే కోపం ఉంటుందని, కళ్లెదుట జరిగే దారుణాలపై తనకు కూడా ఆవేశం వస్తుందని వివరించారు. అయితే, తన కోపం, ఆవేశం తాత్కాలికమైనవి కావని… సమస్య ఎక్కడుందో దాని మూలం వెతికి పరిష్కారం కోసం ఆలోచిస్తానని చెప్పారు. 

రాజధానితో పాటు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉండాలని ఆలోచిస్తానని తెలిపారు. కేవలం ఐటీ రంగమే గౌరవప్రదమైనది అనే ఆలోచన కాకుండా, వ్యవసాయ, వ్యాపార రంగాలు కూడా అద్భుతమైనవి అనేలా తీర్చిదిద్దాలని అభిలషించారు. 

యువత సాధికారత దిశగా ఆలోచించాలని, నా కోసం అనే ధోరణి విడనాడి సమాజం కోసం అనే ధోరణి అలవర్చుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పనని, కానీ అందరికీ ఉపయోగపడే పనులు మాత్రం కచ్చితంగా చేస్తానని స్పష్టం చేశారు.

Related posts

అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం…

Ram Narayana

చంద్ర‌బాబు రైతుల‌ను రోడ్డున ప‌డేశారు: వైఎస్ జ‌గ‌న్‌!

Ram Narayana

ఏపీలో జంపింగ్ జిలానీలు …జనసేనలోకి బాలినేని ,సామినేని

Ram Narayana

Leave a Comment