- పాత బాల రాముడి విగ్రహం ఐదారు అంగుళాలు మాత్రమే
- 25 అడుగుల దూరంలో ఉన్న వారికి సరిగా కనిపించదన్న ట్రస్టు కోశాధికారి
- గర్భగుడిలోని కొత్త విగ్రహం ముందు పాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి
దేశంలోని వంద కోట్ల మంది హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయింది. శతాబ్దాల ఎదురుచూపులు, దశాబ్దాల పోరాటం తర్వాత రామ మందిర సుదీర్ఘ కల నెరవేరబోతోంది. కాసేపట్లో అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో యావత్ దేశం రామ నామ స్మరణతో మారుమోగుతోంది. ఎక్కడ చూసినా జైశ్రీరాం అనే నినాదాలు వినిపిస్తున్నాయి. శ్రీరాముడి జెండాలు కనిపిస్తున్నాయి. రామ మందిరాలు, హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
అయోధ్య రామాలయ గర్భగుడిలో 51 అంగులాల కొత్త మూర్తిని ప్రతిష్ఠించారు. అయితే, ఇక్కడే అందరికీ ఒక సందేహం తలెత్తుతోంది. మందిరంలోని పాత విగ్రహాన్ని ఏం చేయబోతున్నారనేదే ఆ సందేహం. ఈ సందేహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి నివృత్తి చేశారు. పాత విగ్రహం ఎత్తు ఐదారు అంగుళాలు మాత్రమేనని… 25 నుంచి 30 అడుగుల దూరంలో ఉన్న వారికి ఆ విగ్రహం సరిగా కనిపించదని ఆయన చెప్పారు. అందుకే 51 అంగుళాల కొత్త మూర్తిని ఏర్పాటు చేశామని తెలిపారు. పాత బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో కొత్తగా ఏర్పాటు చేసిన బాల రాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
రామ మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 1,100 కోట్లకు పైగా ఖర్చయిందని గోవింద్ దేవ్ గిరి తెలిపారు. మొత్తం పనులు పూర్తి కావడానికి మరో రూ. 300 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. గర్భగుడిలో ఏర్పాటు చేయడానికి మొత్తం మూడు విగ్రహాలు తయారయ్యాయి. వీటిలో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన మూర్తిని ఎంపిక చేశారు. మిగిలిన రెండు విగ్రహాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయని… వాటిని కూడా ఆలయంలోనే ఏర్పాటు చేస్తామని గోవింద్ దేవ్ చెప్పారు.
దేశమంతా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని, యువత కూడా భక్తి పారవశ్యంలో ఉండటం మంచి పరిణామమని అన్నారు. రామ మందిర కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందిస్తూ… జనవరి 23 నుంచి మళ్లీ నిర్మాణ పనులను మొదలు పెడతామని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో మరో ఏడు ఉపాలయాలు నిర్మించాల్సి ఉందని వెల్లడించారు.