ఖమ్మంను ఆదర్శంగా ,పరిశుభ్రమైన నగరంగా తీర్చు దిద్దాలి …మంత్రి తుమ్మల
నగర కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం …
పరిశుభ్రమైన ఖమ్మం కోసం పలుసూచనలు చేసిన మంత్రి
జనాభాకు తగ్గట్లుగా వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్న మంత్రి
ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలి …మంత్రి
ప్రభుత్వ స్థలాలు , ఆక్రమణకు గురైన స్థలాలు ,ఎన్ఎస్పీ భూముల వివరాలు అందజేయాలని అధికారులకు ఆదేశం …
నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు తెలవాలి …
ఖమ్మం నగరాన్ని క్లిన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్ది ఆదర్శమైన నగరంగా మార్చాలని అందుకు అధికారులు సిబ్బంది కృషి అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్పొరేషన్ అధికారులకు హితబోధ చేశారు …మంగళవారం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో ఖమ్మం నగర అభివృద్ధి అవసరాలపై మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు …ఈసందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు …
ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో, నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి, అధికారులతో నగర అభివృద్ధి పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం నగరాన్ని సానిటేషన్, ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ తదితర అన్ని విభాగాల్లో మోడల్ గా వుండేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం నగర జనాభా 4 లక్షల 23 వేలకు చేరుకున్నట్లు, 69.50 ఎంఎల్డి త్రాగునీటి సరఫరా చేస్తున్నట్లు, వేసవిలో నగరంలోని ఏ ప్రాంతంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పరిశుభ్ర నగరంగా ఖమ్మం కు పేరు రావాలని, ఈ దిశగా కార్పొరేషన్ ప్రతి విభాగ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలను వెంట వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సంవత్సరం వివిధ గ్రాంట్ల క్రింద రూ. 113 కోట్ల 24 లక్షలతో 574 పనులు చేపట్టినట్లు, ఇందులో 488 పనులు పూర్తి కాగా, 19 పనులు పురోగతిలో, 67 పనులు ఇంకనూ ప్రారంభించలేదని ఆయన తెలిపారు. పూర్తి అయిన పనులకు ఇప్పటి వరకు రూ. 24 కోట్ల 72 లక్షలు చెల్లించినట్లు ఆయన అన్నారు. పురోగతిలో ఉన్న పనుల పూర్తికి చర్యలు వేగం చేయాలన్నారు. సుడా ద్వారా రూ. 45 కోట్ల 7 లక్షలతో 48 పనులు మంజూరుకాగా, 38 పనులు పూర్తి అయినట్లు, రూ. 28 కోట్ల 89 లక్షలు ఖర్చు చేయగా, ఇంకనూ రూ 5 కోట్ల 61 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. పబ్లిక్ హెల్త్ విభాగం ద్వారా ఈ సంవత్సరం డిఎంఎఫ్టి క్రింద రూ. 10 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 2 కోట్లు, 15వ ఆర్థిక సంఘం టైడ్ ద్వారా రూ. 3.70 కోట్లు 13 పనులకు మంజూరు కాగా, 3 పనులు పూర్తి అయినట్లు, 2 పనులు పురోగతిలో ఉండగా, 8 పనులు ఇంకనూ ప్రారంభించలేదని ఆయన అన్నారు. గత 5 సంవత్సరాల్లో ట్యాక్సుల ద్వారా రూ. 110.53 కోట్లు, అద్దెల ద్వారా రూ. 3.78 కోట్లు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా రూ. 5.10 కోట్లు, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ అనుమతుల ద్వారా రూ. 92.56 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ ల ద్వారా రూ. 3 కోట్లు, పట్టణ ప్రగతి గ్రాంట్లు రూ. 55 కోట్లు, ఇతర గ్రాంట్ల ద్వారా రూ. 122.84 కోట్లు, నీటి పన్ను ద్వారా రూ. 13.01 కోట్లు, మొత్తంగా రూ. 405.82 కోట్ల రెవిన్యూ వచ్చినట్లు ఆయన అన్నారు. 2023-24సంవత్సరానికి రూ. 3984.07 లక్షల పన్ను వసూలు డిమాండ్ ఉండగా, ఇప్పటి వరకు రూ. 1751 లక్షలు వసూలు అయినట్లు, పక్కా ప్రణాళికతో 100 శాతం వసూళ్లు చేయాలన్నారు. 2020 నుండి 2023 వరకు సుడా ద్వారా 1155 అనుమతులు ఇవ్వగా, రూ 3301.84 లక్షలు వసూలు అయినట్లు ఆయన అన్నారు.
నగర పాలక సంస్థ లో 385 రెగ్యులర్ పోస్టులకు గాను 229 మంది పనిచేస్తున్నట్లు, 156 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 1013 మంది వివిధ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నెలకు రూ. 196.35 లక్షలు చెల్లిస్తున్నట్లు మంత్రి అన్నారు.
విలువైన ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలు, ఆక్రమణకు గురైన స్థలాలు, ఎన్ఎస్పి స్థలాలు ఎక్కడ ఎంత మేర ఉన్నాయి నివేదిక సమర్పించాలని, ఆక్రమనలపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చిన చోట, పట్టాలు పొందిన వారే వుంటున్నారా, లేక అమ్మడం ఇతరత్రా జరిగిందా విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్ఎస్పీ భూమి ఏ ఏ అవసరాలకు ఎవరెవరికి ఎంత కేటాయించింది నివేదిక సమర్పించాలన్నారు. లకారం, ఖానాపురం, మున్నేరు, ధాంసలాపురంల వద్ద బఫర్ జోన్ డిమార్కు చేసి, నిర్మాణాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రోడ్ల విస్తరణతో నగర సుందరీకరణ అవుతుందని, నగరంలో వచ్చే 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ ప్రదేశాల్లో రోడ్ల విస్తరణ ఆవశ్యకత వుందో పరిశీలన చేసి, నివేదిక సమర్పించాలన్నారు. సమీక్షలో సుడా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కు మార్పులపై చర్చించారు.
ఇల్లందు క్రాస్ రోడ్, ముస్తఫానగర్ ప్రాంతాల్లో కమర్షియల్ కేటగిరీలుగా ఉండగా, రెసిడెన్షియల్ కేటగిరీలుగా, ప్రకాష్ నగర్ నుండి ధాంసలాపురం రోడ్, గోళ్లపాడు ఛానల్ అభివృద్ధి, బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో మున్నేరు నది నుండి 50 మీటర్ల బఫర్ జోన్ లకు ఆలోచన చేయాలన్నారు. ప్రాజెక్టులకు ప్రణాళికలు చేసి, నివేదిక సమర్పించాలని, రాష్ట్ర, కేంద్రం నుండి నిధులు తెస్తానని, ప్రాజెక్టుల ద్వారా కల్పించే వినోదానికి ట్యాక్స్ వసూలు చేయాలని, ట్యాక్స్ ద్వారా అట్టి ప్రాజెక్టు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. తల్లిదండ్రుల దయవల్ల మంచి పొజిషన్ వచ్చిందని, ఈ పొజిషన్ లో మనం చేసే కష్టం వల్ల మంచి పేరు రావాలని, మనకు సంతృప్తి కలగాలని ప్రజలకు సౌకర్యాలు మెరుగుడాలని మంత్రి అన్నారు. అధికారులు స్వేచ్ఛ గా, స్వతంత్రంగా, ఒత్తిడి లేకుండా పనిచేయాలని, నిబద్ధతతో నగర అభివృద్ధి, ప్రజలకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టి ఖమ్మం నగరానికి మంచిపేరు తేవాలని మంత్రి తెలిపారు.
ఈ సమీక్ష లో ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, ఖమ్మం నగర పాలక సంస్థ సహాయ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.