Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు

  • పాలకొల్లులో ప్రజాగళం సభ
  • రఘురామను టీడీపీలో చేర్చుకుంటున్నట్టు స్వయంగా ప్రకటించిన చంద్రబాబు
  • సభ ప్రారంభానికి ముందే రఘురామకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు

వైసీపీ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నేత రఘురామకృష్ణరాజు అని కొనియాడారు. ప్రజలందరి ఆమోదంతో ఆయనను ఇవాళ పాలకొల్లు సభ ద్వారా తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నామని అన్నారు. 

“మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం… ఒక ఎంపీని తన నియోజకవర్గానికి రాకుండా చేశాడు దుర్మార్గుడు… ఇది ఆమోదయోగ్యమా? ఏమిటీ అరాచక పాలన? ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇష్టానుసారం చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు రాత్రంతా నేను మేలుకునే ఉన్నాను. భారత రాష్ట్రపతికి, గవర్నర్ కు విన్నవించాం… కోర్టులో అన్ని విధాలా ప్రయత్నాలు చేశాం… చివరికి కోర్టు జోక్యం చేసుకోవడంతో ఆయన బయటపడ్డాడు… లేకపోతే ఇవాళ మీరు రఘురామకృష్ణరాజును చూసేవారు కాదు. 

ఒక దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇలాంటి వ్యక్తులను కూడా కలుపుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే రఘురామను మనస్ఫూర్తిగా టీడీపీలో చేర్చుకుంటున్నాం” అని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.

చంద్రబాబు వల్లే ఇవాళ ప్రాణాలతో ఉన్నాను: టీడీపీలో చేరిన అనంతరం రఘురామ భావోద్వేగం

Raghurama emotional speech in Palakollu

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రజాగళం సభా వేదికపై రఘురామకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పారు. రఘురామను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీలో చేరిన అనంతరం రఘురామ ప్రసంగించారు. 

“టీడీపీ అభిమానులకు, జనసేన అభిమానులకు, బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు. గతంలో నా ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబే. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా, న్యాయవాదులతో మాట్లాడడమే కాకుండా, నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారు. తొందరపడొద్దమ్మా… ఏమీ కాదు, నేను ఉన్నాను అని నా భార్యకు, నా కుమార్తెకు, నా కొడుకుకు ధైర్యం చెప్పారు. 

ఉన్నాను, విన్నాను అని కొందరు సొల్లు కబుర్లు చెబుతారు… చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు. నా బాధ విన్నారు కాబట్టే… ఆయన ఇవాళ చెప్పినట్టు నేను మీ ముందు బతికున్నా. అందుకే చంద్రబాబుకు నేనెంతో రుణపడి ఉన్నాను. 

కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇవాళ చంద్రబాబు చొరవతో మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అతి త్వరలోనే జూన్ 4న చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్రమోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారు.  

ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని నేను సంవత్సరంగా చెబుతూనే ఉన్నాను. ఇందులో మోదీ బ్రహ్మ అయితే, విష్ణుమూర్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరమశివుడు. మనమందరం సైనికులం… జై టీడీపీ, జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్, జై నరేంద్ర మోదీ” అంటూ రఘురామ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు.

Related posts

ఏపీలో జగన్ ఘోరంగా ఓడిపోతారు …ప్రశాంత్ కిషోర్ జోశ్యం

Ram Narayana

చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా, అప్పుగా ఇచ్చినట్టు చూపించారు: షర్మిల

Ram Narayana

వైసీపీ నుంచి నేను గెలవకపోవడమే మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Ram Narayana

Leave a Comment