Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘రాధాకిషన్‌రావు బ్యాచ్’ దారుణం మరోటి వెలుగులోకి..!

  • హెల్త్‌కేర్ సంస్థ యజమానిని కిడ్నాప్ చేసిన రాధాకిషన్‌రావు బృందం
  • పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి ఆయన భాగస్వాముల పేరిట షేర్ల బదిలీ
  • ప్రతిగా వారి నుంచి రూ. 10 లక్షలు తీసుకున్న వైనం
  • బయటపెడితే చంపేస్తామని బెదిరింపు
  • రాధాకిషన్‌రావు అరెస్టుతో ధైర్యం తెచ్చుకుని ఆరేళ్ల తర్వాత ఫిర్యాదు
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులోని వికృతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు బ్యాచ్ చేసిన దురాగతాలు ముక్కున వేలేసుకొనేలా చేస్తున్నాయి. ఓ హెల్త్‌కేర్ సంస్థ యజమానిని కిడ్నాప్ చేసి టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలోనే నిర్బంధించి, బెదిరించి అతడి నుంచి షేర్లు రాయించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ 2011లో జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 72లో ‘క్రియా హెల్త్‌కేర్’ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. కంపెనీ క్రమంగా అభివృద్ధి చెంది రూ. 250 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించే ఉద్దేశంతో గోపాల్, రాజ్, నవీన్, రవి అనే వ్యక్తులను భాగస్వాములుగా చేర్చుకున్నారు. బాలాజీ అనే వ్యక్తిని సీఈవోగా నియమించుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోనూ టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్ధమయ్యారు.

 కంపెనీని కొట్టేసే ప్లాన్ 
కంపెనీ దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతుండడంతో కన్నుకుట్టిన భాగస్వాములు దానిని తమ సొంతం చేసుకోవాలని భావించారు. షేర్లను తమకు అమ్మాలంటూ వేణుమాధవ్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియని వేణుమాధవ్.. గోల్డ్‌ఫిష్ అడోబ్ సంస్థ సీఈవో చంద్రశేఖర్‌ను సంప్రదిస్తే, సమస్యను పరిష్కరిస్తానంటూ నమ్మకంగా చెప్పి, వేణుమాధవ్ పేరిట ఉన్న 4 లక్షల షేర్లను తాత్కాలికంగా బదిలీ చేయించుకున్నారు. అనంతరం భాగస్వాముల బెదిరింపులు ఎక్కువవడంతో వేణుమాధవ్ పోలీసులను ఆశ్రయించారు.

టాస్క్‌ఫోర్స్ పోలీసుల పేరుతో కిడ్నాప్
వేణుమాధవ్ ఆఫీసు నుంచి తన కారులో ఇంటికి వెళ్తుండగా 22 నవంబరు 2018లో కొందరు ఆయనను కిడ్నాప్ చేశారు. వారిలో అప్పటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై మల్లికార్జున్‌తోపాటు మరికొందరు పోలీసులు కూడా ఉన్నారు. వేణుమాధవ్‌ను అక్కడి నుంచి సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించి ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు గదిలో నిర్బంధించారు. అక్కడికి ఆయన వ్యాపార భాగస్వాములతోపాటు గోల్డ్‌ఫిష్ సీఈవో చంద్రశేఖర్ కూడా చేరుకున్నారు. దీంతో వీళ్లంతా కుమ్మక్కయ్యారన్న విషయం ఆయనకు అర్థమైంది. అక్కడ అందరూ కలిసి ఆయనను బెదిరించారు. బాధితుడు తన మిత్రుడైన లహరి రిసార్ట్స్ ఎండీ సంజయ్‌కు ఫోన్‌లో విషయం చెబితే ఆయన డీజీపీని కలిసి వివరించారు. స్పందించిన డీజీపీ రాధాకిషన్‌కు ఫోన్ చేస్తే ఆయన తప్పుడు సమాచారమిచ్చి ఏమార్చారు. మనీలాండరింగ్‌తోపాటు మరికొన్ని కేసుల్లో వేణుమాధవ్‌ను తీసుకొచ్చినట్టు చెప్పి డీజీపీనే బోల్తా కొట్టించారు.

మీడియాకు చెబితే చంపేస్తాం
నిర్బంధంలో ఉన్న వేణుమాధవ్ షేర్లను అక్కడే బలవంతంగా భాగస్వాముల పేరిట బదిలీ చేయించిన పోలీసులు.. అందుకు ప్రతిఫలంగా రాధాకిషన్ అతడి బృందం వారి నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నారు. ఇక వదిలేస్తున్నామని, విషయం బయట పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్న వేణుమాధవ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు అరెస్ట్ కావడంతో ధైర్యం తెచ్చుకుని తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..హత్య..

Drukpadam

ఇటలీ తీరంలో విషాద ఘటన… శరణార్థుల పడవ మునిగి 34 మంది మృతి!

Drukpadam

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా.. 25 మంది దుర్మరణం

Drukpadam

Leave a Comment