- తాను ముస్లింలకు వ్యతిరేకులమని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
- ఎవరినీ వ్యతిరేకించడం తమ విధానం కాదని స్పష్టీకరణ
- ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడే తన నిజాయితీని అర్థం చేసుకున్నారని వెల్లడి
ముస్లిం వ్యతిరేకులని తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని… కానీ తాను ఇస్లాంకు, ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఓ జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ఎవరినీ వ్యతిరేకించడం తమ విధానం కాదన్నారు. నెహ్రూ కాలం నుంచే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని… దాని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు.
ముస్లిం వ్యతిరేకులు అంటూ తమపై అబద్దాలు ప్రచారం చేస్తూ… వారేమో కపట ప్రేమను చూపిస్తారని విమర్శించారు. కానీ ఇప్పుడు ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారిందన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు ముస్లిం సోదరీమణులు తన నిజాయితీని అర్థం చేసుకున్నారన్నారు.
ఆయుష్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కరోనా వ్యాక్సీన్లు అందించినప్పుడూ అలాగే భావించారన్నారు. తాను ఎవరి పైనా వివక్ష చూపలేదని అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అందరినీ తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలు రకరకాల అబద్దాలు చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.