ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే చాలని జగన్ భావించారు… దాని ఫలితం జూన్ 4న తెలుస్తుంది
- ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పీకే
- ఈసారి ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోర పరాజయం చూడబోతోందని వెల్లడి
- జగన్ ఒక ప్రొవైడర్ మాత్రమే… లీడర్ కాదని వ్యాఖ్యలు
- వైసీపీ ఓడిపోబోతోందన్న విషయం జగన్ కు ఢిల్లీలోనే చెప్పానని స్పష్టీకరణ
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎన్నికల ముంగిట ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ, జగన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారని, కానీ ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చూడబోతోందని అన్నారు. ఇది తన అంచనా అని తెలిపారు.
ఇక, జగన్ కు, తనకు మధ్య గొడవ ఉందని జరుగుతున్న ప్రచారంపైనా ప్రశాంత్ కిశోర్ స్పందించారు. జగన్ తనకు స్నేహితుడు అని, తనకు ఆయనకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. మొదటి నుంచి తామిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఏపీకి రాలేదని, ఇక తమ మధ్య వివాదం ఎలా ఏర్పడుతుందని ప్రశ్నించారు.
అయితే, ఏడాదిన్నర కిందట జగన్ తనను ఢిల్లీలో కలిశారని, ఈసారి మీరు దారుణంగా ఓడిపోబోతున్నారని ఆయనకు అప్పుడే చెప్పానని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. కానీ తన మాటలను జగన్ అంగీకరించలేదని తెలిపారు. ఆ రోజు ఢిల్లీలో మాట్లాడిన దాని ప్రకారం… ఏపీలో తమకు తిరుగులేదని జగన్ భావించారని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. జగన్ 155 సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారని, అలా జరిగితే మంచిదే కదా అని తాను అన్నానని గుర్తు చేసుకున్నారు.
ఈసారి జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, జగన్ ఒక తప్పుకు పరిమితం కాలేదని, 2019లో భారీ విజయం సాధించాక తప్పు మీద తప్పు చేస్తూ వెళ్లాడని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. తనను తాను ఒక ప్రొవైడర్ (ఇచ్చేవాడు)గా భావించుకున్నాడని అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు నేతలను ఎన్నుకుంటారని, రాజులను కాదని స్పష్టం చేశారు. కానీ కొందరు తమను తాము రాజు అనుకుంటారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు ఏమీ అవసరం లేదు… వాళ్లకు ఖాతాల్లో డబ్బులు వేస్తే సరిపోతుందని జగన్ భావించారని ప్రశాంత్ కిశోర్ విశ్లేషించారు.
రోడ్లు వేయకపోయినా ఫర్వాలేదు, ఏపీకి రాజధాని లేకపోయినా ఫర్వాలేదు, ఉపాధి అక్కర్లేదు… నేను డబ్బులు వేస్తూనే ఉంటా అనే ధోరణిని జగన్ అవలంబించారని వివరించారు. కానీ ఏపీ ప్రజల ఆర్థిక స్థితి దిగజారిందని, ప్రజలు సీఎంను కలిసే పరిస్థితి లేదని అన్నారు.
“ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడి బాధ్యత ఏమిటంటే… సంక్షేమం అవసరమైన వారికి సంక్షేమం అందించాలి, విద్య అవసరమైన వారికి విద్య అందించాలి, ఉద్యోగాలు అవసరమైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేయాలి. ప్రజల ఆకాంక్షలు, తక్షణ అవసరాలు… ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి.
కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కటే ఆలోచించారు…. నేను సంక్షేమం పేరిట డబ్బులు ఇస్తూనే ఉంటా… ప్రజలు జీవితాంతం నాకే ఓటు వేస్తారు అనుకుంటున్నారు. సంక్షేమం అందుతోంది కదా… నువ్వు నన్ను ప్రశ్నించొద్దు అనేది ఆయన వైఖరి. ఇది ప్రొవైడర్ లక్షణం… లీడర్ లక్షణం కానే కాదు. అందుకే జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మోహన్ రెడ్డి షాక్ కు గురవుతారు. ఓడిపోయామన్న విషయం అర్థం చేసుకోవడం వారికి చాలా కష్టంగా ఉంటుంది” అంటూ ప్రశాంత్ కిశోర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.