- భారీ ఈదురుగాలులకు ఒక్కసారిగా కుప్పకూలి పెట్రోల్ బంక్ పై పడటంతో దుర్ఘటన
- మరో 74 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయ చర్యలు
- మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం
దుమ్ము ధూళితో కూడిన భారీ ఈదురుగాలులు, వర్షం సోమవారం సాయంత్రం ముంబైపై విరుచుకుపడిన ఉదంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ గాలులకు ఘట్ కోపర్ ప్రాంతంలోని చెడ్డానగర్ జంక్షన్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన 230 అడుగుల పొడవైన హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలి కిందనున్న పెట్రోల్ బంక్ పై పడింది. హోర్డింగ్ బరువుకు పెట్రోల్ బంక్ పైకప్పు కూలిపోవడంతో దాని కింద చిక్కుకొని 14 మంది మృతి చెందారు. మరో 74 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను కాపాడేందుకు రంగంలోకి దిగిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ.. మంగళవారం తెల్లవారుజాము నాటికి ఎనిమిది మృతదేహాలను వెలికితీసింది. మరో నాలుగు మృతదేహాలను శిథిలాల్లో గుర్తించింది. అయితే పెట్రోల్ బంకులో భారీ స్థాయిలో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉండటం సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తోందని ఎన్డీఆర్ ఎఫ్ తెలిపింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు తమ అనుమతి లేకుండా అక్రమంగా భారీ హోర్డింగ్ ను స్థల యజమాని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థల యజమానితోపాటు మరికొందరపై పోలీసులు కేసు నమోదు చేశారు.