- అధికారంలోకి వచ్చీ రాగానే స్కాంలకు తెరలేపిందని ఫైర్
- సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న మాజీ మంత్రి
- గ్లోబల్ టెండర్ల పేరుతో కుంభకోణం చేసిందని ఆరోపణ
ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో అలా అవినీతికి తెరలేపిందని, 50 రోజుల్లోనే రూ.1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సన్నబియ్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
35 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలవడం వెనక అధికార పార్టీ అవినీతి దాగుందని కేటీఆర్ చెప్పారు. ఒకేరోజులో గైడ్ లైన్స్ జారీ చేసి అదేరోజు టెండర్లు ఆహ్వానించడం వెనక మతలబు ఇదేనని ఆరోపించారు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా వారిని పక్కన పెట్టి గ్లోబల్ టెండర్లు పిలిచిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రీయ బండార్ సంస్థ మనీలాండరింగ్ కు పాల్పడడంతో తమ ప్రభుత్వం బ్లాక్ చేయగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూల్స్ బ్రేక్ చేసి కేంద్రీయ బండార్ తో పాటు నాలుగు సంస్థలకు వంతపాడుతోందని విమర్శించారు. ఈ సంస్థలు రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బెదిరింపులకు గురిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరుతో మరో కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు స్కాంలు కలిపి రూ.1100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. ఈ స్కాంలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేకమంది హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రం కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్ సీఐ కానీ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్రం, ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే తాము న్యాయ పోరాటానికి దిగుతామని, దోషులను ప్రజల ముందు నిలబెడతామని కేటీఆర్ చెప్పారు.