ముఖేశ్ అంబానీ వీడియోతో వైద్యురాలికి టోకరా.. రూ.7.1 లక్షల దోపిడీ
- ముఖేశ్ అంబానీ డీఫ్ ఫేక్ వీడియోతో ట్రేడింగ్ కంపెనీ ప్రచారం
- ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చూసి నిజమని నమ్మిన వైద్యురాలు
- సంస్థను ఫోన్ ద్వారా సంప్రదించి రూ.7.1 లక్షలు బదిలీ
- రూ.30 లక్షల లాభం వచ్చినట్టు కనిపించడంతో విత్‌డ్రాయెల్‌కు ప్రయత్నించి విఫలం
- మోసపోయానని గ్రహించి చివరకు పోలీసులకు ఫిర్యాదు
ముఖేశ్ అంబానీ ఫేక్ వీడియోతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేసి ఏకంగా రూ.7 లక్షలు దోచుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించారు.
కేహెచ్ పాటిల్ అనే మహిళ ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టా గ్రామ్‌లో ఆమెకు రాజీవ్ శర్మ ట్రేడింగ్ గ్రూప్ పేరిట ఉన్న కంపెనీ ప్రకటన కనిపించింది. ఈ కంపెనీని స్వయంగా ముఖేశ్ అంబానీ ప్రమోట్ చేస్తున్నట్టు నిందితులు డీప్ ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. పెట్టుబడులపై భారీగా లాభాలు కళ్లచూడొచ్చని ఆశపెట్టారు. కంపెనీకి లండన్‌తో పాటు ముంబైలో కూడా శాఖలు ఉన్నట్టు ఆన్‌లైన్ సెర్చ్ ద్వారా తెలుసుకున్న ఆమె మరో ఆలోచన లేకుండా సంస్థను ఫోన్‌లో సంప్రదించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కారు.
నిందితులు చెప్పినట్టే ఆమె ట్రేడింగ్ కోసం రూ. 7.1 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకే తన అకౌంట్‌లో రూ. 30 లక్షల లాభం కనిపించడంతో మురిసిపోయిన ఆమె వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు పలు మార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో, తాను మోసపోయానని గ్రహించి విషయాన్ని తన స్నేహితులకు చెప్పారు. వారి సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.