- జాబితాలో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్
- దశాబ్దాలపాటు కొనసాగిన బాక్సింగ్ తొలగింపు
- గతేడాది అక్టోబర్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న ఐవోసీ
పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు ఆదివారంతో ముగిసిపోయాయి. 40 స్వర్ణాలతో కలుపుకొని మొత్తం 126 పతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఇక అమెరికాతో సమానంగా 40 స్వర్ణాలతో సాధించి మొత్తం 91 పతకాలు గెలిచిన చైనా రెండో స్థానంలో నిలిచింది. కాగా తదుపరి ఒలింపిక్స్ 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్నాయి. అమెరికా వేదికగా జరగనున్న ఈ విశ్వ క్రీడల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
కొత్తగా ఐదు క్రీడలు చేరనున్నాయి. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్ క్రీడలను కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు గతేడాది అక్టోబర్ 2023లో ఐవోసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ)కి చెందిన ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ (ఈబీ) తదుపరి ఒలింపిక్ ప్రోగ్రామ్‌కు ఆమోదం తెలిపాయి.
నిజానికి 1992 బార్సిలోనా గేమ్స్‌లో బేస్‌బాల్ అధికారికంగా ప్రవేశపెట్టారు. కానీ 2012, 2016, 2020, 2024 ఒలింపిక్ గేమ్స్ నుంచి తొలగించారు. తిరిగి లాస్ ఏంజిల్స్ విశ్వక్రీడల్లో ఈ ఆట అడుగుపెట్టబోతోంది. ఇక టోక్యో గేమ్స్‌లో ప్రదర్శించిన సాఫ్ట్ బాల్‌ను లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. ఫ్లాగ్ ఫుట్‌బాల్ తొలిసారి 2028 లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో ఆడించబోతున్నారు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో తొలిసారి స్క్వాష్‌ను ఆడించబోతున్నారు. లాక్రోస్ క్రీడను ఏకంగా 120 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో తిరిగి ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రీడను 1904, 1908 గేమ్స్‌లో మాత్రమే ఆడించారు. ఆ తర్వాత తొలగించారు.
ఇక భారతీయులు ఎంతో అమితంగా ఇష్టపడే క్రికెట్ దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో మళ్లీ అడుగుపెడుతోంది. 1900 ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ ఆడినప్పుడు క్రికెట్‌ను ఆడించారు. 20 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహించారు.
తొలగించనున్న క్రీడలు ఇవే..
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్ నుంచి పలు క్రీడలను తొలగించాలని ఐవోసీ నిర్ణయించింది. పారిస్ ఒలింపిక్స్ ద్వారా చరిత్రలో తొలిసారి ప్రవేశపెట్టిన బ్రేక్ డ్యాన్స్ ను, సుదీర్ఘ చరిత్ర ఉన్న బాక్సింగ్‌ను తొలగించాలని నిర్ణయించారు. దాదాపు ఒక శతాబ్దానికి పైగా ఒలింపిక్స్‌లో బాక్సింగ్ భాగంగా ఉంది. కానీ లాస్ ఏంజిల్స్ విశ్వక్రీడల్లో ఆడించనున్న ఆటల జాబితాలో బాక్సింగ్ లేదు. అయితే బాక్సింగ్‌పై తుది నిర్ణయం వచ్చే ఏడాది తీసుకుంటామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ చెప్పారు.