Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తామంటే కుదరదు: చంద్రబాబు

  • తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
  • ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని ఆగ్రహం
  • తిరుమలలో రూల్స్ అలా ఉన్నాయన్న సీఎం చంద్రబాబు
  • అందుకే పాబ్లో ఎస్కొబార్ అనేది అంటూ వ్యంగ్యం 
  • బైబిల్ నాలుగ్గోడల మధ్య చదవడం ఎందుకు… బయటికొచ్చి కూడా చదవచ్చని హితవు

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్ మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి బదులిచ్చారు. ఏ వ్యక్తి అయినా తిరుమల వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తామంటే కుదరదు అని తేల్చి చెప్పారు. ఇష్టం లేకపోతే తిరుమల వెళ్లొద్దు… ఇష్టముంటే వెళ్లండి… వెళ్లినప్పుడు అక్కడి సంప్రదాయాలు పాటించి ఆలయంలోకి వెళ్లండి… అని స్పష్టం చేశారు. 

నన్ను అడగడానికి మీరెవరు? అంటే… అడుగుతున్నది నేను కాదు… తిరుమలలో రూల్స్ ఆ విధంగా ఉన్నాయి… ఆ రూల్స్ లో ఉన్నది పాటించి తీరాలి… అని ఉద్ఘాటించారు. 

“తిరుమల వెళ్లొద్దని జగన్ కు ఎవరూ చెప్పలేదు. తిరుమల వెళ్లొద్దని జగన్ కు ఎవరైనా నోటీసులు ఇచ్చారా? ర్యాలీలు, జనసమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పాం. తిరుమల వెళ్లినప్పుడు అక్కడి నియమనిబంధనలను, ఆగమశాస్త్ర ఆచార సంప్రదాయాలను పాటించాలని చెప్పాం. అలాంటివి పాటించకపోతే మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది.

ఇవాళ అతను మాట్లాడిన మాటలు చూస్తే… నేను వెళతాను అంటున్నాడు. నేను అనుభవంతో చెబుతున్నా… ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా వెళ్లాను… ఇప్పుడు కూడా అలాగే వెళతాను అంటున్నాడు… ఇంతకుముందు నిబంధనలు అతిక్రమించావు… ఇప్పుడు కూడా నిబంధనలు మళ్లీ అతిక్రమించాలా? 

ఇంతకుముందు మీరు చట్టాన్ని ధిక్కరించి, బెదిరించి ఆలయం లోపలికి వెళితే, అది శాశ్వత అధికారం అవుతుందా? చట్టాలను చేసే శాసనసభ్యులుగా మనం చేసిన శాసనాలనే మనం గౌరవించకపోతే, ప్రజలెందుకు గౌరవిస్తారు? దౌర్జన్యం చేస్తాం, రౌడీయిజం చేస్తాం అంటే కుదరదు. 

తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని చెబుతున్నాడు. బయటికి వెళితే హిందూ మతాన్ని గౌరవిస్తానని కూడా చెబుతున్నాడు. గుడ్… గౌరవించడం అంటే ఏమిటి… ఆ ఆలయానికి వెళ్లినప్పుడు ఆ ఆలయ సంప్రదాయాలను పాటించడం, అక్కడుండే ఆచారాలను అమలు చేయడం, అక్కడి నియమనిబంధనలు ఉల్లంఘించకపోవడం. 

అలా కాకుండా… ఇప్పటిదాకా నన్నెవరు ఇలా అడగలేదు, ఇప్పుడెందుకు అడుతున్నారు అనడం సమంజసం కాదు. బైబిల్ చదువుతున్నావు అంటే దానిపై నీకు నమ్మకం ఉంది కాబట్టి. అందులో తప్పులేదు. బైబిల్ రూంలోనే ఎందుకు చదువుకోవాలి, బయట కూడా చదువుకోవచ్చు కదా! నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు… నేను సూటిగా అడుతున్నా… నమ్మకం ఉన్నప్పుడు చర్చికి ఎందుకు పోకూడదు? నాలుగ్గోడల మధ్యన చదువుకోవడం ఎందుకు? 

ప్రజలందరూ ఆలోచించాలి. నేను హిందువుని… వెంకటేశ్వరస్వామి వద్దకు వెళతాను. నేను బహిరంగంగానే పూజలు చేస్తాను. అలాగే చర్చికి వెళతాను… వాళ్ల నియమాలను, నిబంధనలను పాటిస్తాను. మసీదుకు వెళతాను… వాళ్ల ఆచారాలను గౌరవిస్తాను. సొంత మతాన్ని ఆచరిస్తాం… మత సామరస్యాన్ని కాపాడతాం. ఇందులో తప్పేమీ లేదే! 

అలాంటప్పుడు బైబిల్ ను లోపలే చదువుకోవడం ఎందుకు… బహిరంగంగానే చదువుకోవచ్చు కదా! లోపల కూర్చుని చదువుకోవడాన్ని నేను తప్పుబట్టడంలేదు. కానీ, లోపల మాత్రమే చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాడు. మతసామరస్యాన్ని కాపాడమంటే, మానవత్వం అంటావేంటి? 

అందుకే పాబ్లో ఎస్కొబార్ అనేది. ఎస్కొబార్ అరాచకాలు బయటికి వస్తుంటే, ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎస్కోబార్ కు, ఇతడికి పోలికలు చూసుకోండి. ఇటీవల సంఘటనలన్నీ ఎస్కోబార్ తరహాలోనే ఉంటున్నాయి” అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. 

“ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు… అతడు ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ అంట. అతనొక అడ్వొకేట్ (పొన్నవోలు). పంది మాంసం బంగారం… నెయ్యి రాగి అంటున్నాడు… బంగారం తీసుకువచ్చి రాగిలో కలుపుతారా అంటున్నాడు. మనోభావాలు అంటే లెక్కలేదా మీకు? 

ఈ విషయాన్ని కనీసం ఖండించారా మాజీ ముఖ్యమంత్రి గారూ? అతడు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా, కాదా? మీ వాళ్లు ఏం మాట్లాడినా మేం భరించాలా? మీకు బాధ్యత లేదా? ఈ విషయాలే నేను అడుగుతున్నా… ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకోమని చెబుతున్నా. ఆలయాలను అపవిత్రం చేసే చర్యలను అడ్డుకునే బాధ్యత మేం తీసుకుంటాం… అందులో ఎలాంటి రాజీ లేదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related posts

How One Designer Fights Racism With Architecture

Drukpadam

లాలు ప్రసాద్ కుమారుల మధ్య తీవ్రస్థాయికి చేరిన విభేదాలు…

Drukpadam

ప్రధాని మోదీ యోగాసనాలు….

Drukpadam

Leave a Comment