ఆశావహులను ఊరిస్తున్న క్యాబినెట్ విస్తరణ …ఈసారైనా కొలిక్కి వస్తుందా …?
సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
మంత్రివర్గ విస్తరణ ..కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై చర్చించే అవకాశం
క్యాబినెట్ విస్తరణపై చర్చించి గ్రీన్ సిగ్నల్‌తో వచ్చే అవకాశం
రేపటి సమావేశంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆశావహులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు (బుధవారం) మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. చాలాకాలంగా వాయిదా పడుతున్న రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ విషయాన్ని ఈసారి తేల్చుకునే వస్తారని సమాచారం. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలను హైకమాండ్‌తో చర్చిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఈసారి సీఎం పర్యటనలో క్యాబినెట్ విస్తరణ అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్న ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఇదే విషయమై అధిష్ఠానంతో చర్చించేందుకు రేవంత్‌రెడ్డి పలుమార్లు హస్తినకు వెళ్లినా పని కాలేదు.
ఇటీవల జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలకు ముందే క్యాబినెట్‌ను విస్తరించాలని అనుకున్నారు. అయితే, హైకమాండ్ పెద్దలు ఆ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో క్యాబినెట్ విస్తరణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొంటున్న రేవంత్‌రెడ్డి.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణ అంశంపై చర్చించి జాబితాతో తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.