- రచ్చకెక్కిన జగన్-షర్మిల ఆస్తుల వ్యవహారం
- ఓ తల్లిగా తనకు ఇద్దరు బిడ్డలూ సమానమేనన్న విజయమ్మ
- బిడ్డలకు ఆస్తులు సమానంగా పంచాలన్నది కూడా నిజమని వెల్లడి
- ఆస్తుల వృద్ధిలో జగన్ కష్టం ఉందనేది నిజం అని స్పష్టీకరణ
జగన్-షర్మిల ఆస్తుల వ్యవహారం తీవ్ర వివాదం రూపుదాల్చిన నేపథ్యంలో, వారి తల్లి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఓ తల్లిగా తనకు ఇద్దరు బిడ్డలూ సమానమేనని స్పష్టం చేశారు. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం అని ఉద్ఘాటించారు. అంతేకాదు, నలుగురు చిన్న బిడ్డలకు ఆస్తులు సమానంగా పంచాలన్న వైఎస్ ఆజ్ఞ కూడా నిజం అని విజయమ్మ పేర్కొన్నారు.
“ఆస్తులు వృద్ధిలోకి తీసుకురావడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. కుటుంబ ఆస్తులను సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నది కూడా నిజం. నాన్నా… నీ తర్వాత ఈ లోకంలో పాప (షర్మిల) మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని అని ఈ మేరకు వైఎస్ చివరి రోజుల్లో జగన్ ఆయనకు మాట ఇచ్చారు. ఈ నిజం ‘నాలో నాతో వైఎస్ఆర్’ పుస్తకంలో ఎప్పుడో రాశాను.
రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉండగా ఆస్తులు పంచలేదు… అప్పుడు అవన్నీ కుటుంబ ఆస్తులే. ఆయన బతికి ఉన్న రోజుల్లో ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. ఆస్తులు పంపకం చేద్దాం అనుకునే సరికి ఆయన ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా విజయసాయిరెడ్డి అవాస్తవాలు మాట్లాడారు.
రాజశేఖర్ రెడ్డి గారు మరణించాక పదేళ్ల పాటు జగన్, షర్మిల కలిసే ఉన్నారు. ఇక, డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకున్నాడు. షర్మిల వాటా కింద జగన్ రూ.200 కోట్లు ఇచ్చాడు. ఒప్పందం ప్రకారం జగన్ కు 60 శాతం, షర్మిలకు 40 శాతం అయితే… ఎంవోయూకి ముందు వరకు సగం సగం డివిడెండ్ తీసుకునేవారు. వీటన్నింటికీ అప్పుడు, ఇప్పుడు నేనే సాక్షి.
“2019లో జగన్ విడిపోదాం అంటూ ఇజ్రాయెల్ లో ఓ ప్రతిపాదన చేశాడు. సీఎం అయిన రెండు నెలల తర్వాత ఈ ప్రతిపాదన చేశాడు. పిల్లలు పెరిగారు… నాకు అల్లుళ్లు వస్తారు… నీకు అల్లుడు, కోడలు వస్తారు… మనం కలిసున్నట్టు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు… అందుకే విడిపోదాం అన్నాడు. దాంతో ఆస్తుల పరంగా కుటుంబం విడిపోవాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత నా సమక్షంలో జగన్ కు అవి, షర్మిలకు ఇవి అంటూ ఎంవోయూ రాసుకోవడం జరిగింది. జగన్ నోటితో చెప్పి, జగన్ చేత్తో రాసిన ఎంవోయూ అది. పాప (షర్మిల)కు హక్కు ఉంది కాబట్టే రూ.200 కోట్ల డివిడెండ్ ఇచ్చారు… పాపకు హక్కు ఉంది కాబట్టే ఎంవోయూ రాసుకున్నారు. ఎంవోయూ ప్రకారం పాపకు జగన్ ఇవ్వాల్సిన ఆస్తులు గిఫ్ట్ గా ఇస్తున్నవి కావు… జగన్ తన బాధ్యత ప్రకారం ఇస్తున్నవి.
రాజకీయాల్లో పాప జగన్ చెప్పినట్టే చేసింది. జగన్ అధికారంలోకి రావడంలో షర్మిల కృషి ఎంతో ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు బతికుంటే ఈ ఆస్తుల గొడవ ఉండేది కాదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలు. ఇది వాళ్లిద్దరి సమస్య… వాళ్లిద్దరే పరిష్కరించుకుంటారు” అని విజయమ్మ తన లేఖలో స్పష్టం చేశారు.
“రాజశేఖర్ రెడ్డి గారు బతికుండగానే ఆస్తులు పంచారన్నది పూర్తిగా తప్పు. అది ముమ్మాటికీ ఆస్తుల పంపకం కాదు. నాడు రాజశేఖర్ రెడ్డి గారు చేసింది ఆస్తుల పంపకం కాదు… కొన్ని ఆస్తులను ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు. విజయసాయిరెడ్డి అప్పుడు ఆడిటర్ గా ఉన్నారు కదా… ఆయనకు ఈ విషయాలు తెలియవా? ముఖ్యంగా… వైవీ సుబ్బారెడ్డి మా ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు” అని విజయమ్మ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకు చాలా బాధ కలుగుతోందని తెలిపారు. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడంలేదని విచారం వ్యక్తం చేశారు. జరగకూడనివన్నీ తన కళ్ల ముందే జరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకోలేని నిస్సహాయురాలిగా మిగిలిపోయానని విజయమ్మ ఆవేదన వెలిబుచ్చారు.
“మా కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. ఆస్తుల వ్యవహారంలో నేను ఇలా అందరి ముందుకు రాకూడదనే అనుకున్నాను. కానీ, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. తెలిసీ తెలియ కొంత… తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. ఇవి కొనసాగరాదు… నా పిల్లలకే కాదు, రాష్ట్రానికి కూడా ఇది మంచిది కాదు. రాజశేఖర్ రెడ్డి గారు… నేను, మా పిల్లలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటారు. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు” అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.