Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

సంప్రదాయం ప్రకారం అర్ధరాత్రి ఓటేసిన ఆరుగురు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ షురూ…

  •  న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని చిన్న పట్టణంలో మొదలైన ఓటింగ్ ప్రక్రియ
  • అర్ధ రాత్రి సమయంలో ఓటు వేసిన ఆరుగురు రిజిస్టర్డ్ ఓటర్లు
  • ట్రంప్, కమలా హారిస్‌లకు చెరో మూడు ఓట్లు వేసిన ఓటర్లు

యావత్ ప్రపంచం ఆసక్తికరంగా గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మొదలైంది. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలో ఉన్న చిన్న పట్టణం డిక్స్‌విల్లే నాచ్‌లో ఓటింగ్ ప్రక్రియ షురూ అయింది. సంప్రదాయ బద్ధంగా ఈసారి కూడా ఇక్కడి ఓటర్లే మొదటి ఓట్లు వేశారు. ఆరుగురు రిజిస్టర్డ్ ఓటర్లు అర్ధరాత్రి సమయంలో ఓట్లు వేశారు. పట్టణంలోని బాల్సమ్స్ రిసార్ట్‌లోని టిల్లోట్‌సన్ రూమ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 60 ఏళ్లుగా ఇక్కడి ఓటర్లే మొదటి ఓటర్లుగా ఉన్నారు. న్యూ హాంప్‌షైర్ రాష్ట్ర చట్టం ప్రకారం.. పట్టణాలు లేదా డిక్స్‌విల్లే నాచ్ లాంటి ఇన్‌కార్పొరేటెడ్ కమ్యూనిటీలు తమ పోలింగ్ స్టేషన్లను అర్ధరాత్రి సమయంలో తెరవడానికి, ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే అక్కడి పోలింగ్ స్టేషన్‌ను మూసివేయడానికి అధికారులకు అనుమతి ఉంటుంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడ కేవలం ఐదుగురు మాత్రమే ఓటు వేశారు.

ట్రంప్‌కు 3 ఓట్లు.. హారిస్‌కు 3 ఓట్లు
ఇక్కడ ఈసారి ఓటు వేసిన ఆరుగురులో ముగ్గురు కమలా హారిస్‌కు, మరో ముగ్గురు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేశారు. ఈ పరిణామం చూస్తుంటే ఈసారి అమెరికా ఎన్నికల్లో ఎంత గట్టి పోటీ ఉందో అర్థం అవుతోందని, దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపించే అవకాశం ఉందని అమెరికా రాజకీయ వర్గాలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈసారి ఇక్కడ ఓటు వేసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. కమలా హారిస్‌కు ఓటు వేశానని చెప్పాడు. ‘‘నేను ప్రెసిడెండ్ కోసం పనిచేస్తే.. అధ్యక్షుడు నా కోసం పనిచేయాలి’’ అని, ట్రంప్‌కు ఓటు వేయకపోవడానికి అతిపెద్ద కారణం ఇదేనని అన్నాడు. ఓటు వేయనంత మాత్రాన ట్రంప్‌కు శత్రువుని కాదని వ్యాఖ్యానించాడు.

Related posts

ఆస్ట్రేలియా వ‌ర్కింగ్ వీసాకు భారీ స్పంద‌న‌.. 1000 వీసాల‌కు 40వేల మంది భార‌తీయుల ద‌ర‌ఖాస్తు

Ram Narayana

హిజ్బుల్లా కొత్త చీఫ్ ఖాస్సేమ్ ఆసక్తికర ప్రకటన…!

Ram Narayana

కెనడాలో భారత్ సహా విదేశీ విద్యార్థులకు షాక్…!

Ram Narayana

Leave a Comment