- బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన రిసోనెన్స్ సంస్థ
- నెంబర్ వన్ గా లండన్
- పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుని సర్వే
లండన్ నగరం… ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నెంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకుంది. గత పదేళ్లుగా ఈ జాబితాలో లండన్ నగరమే వరల్డ్ బెస్ట్ సిటీగా ఉంటోంది. లండన్ తర్వాత స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ, తదితర నగరాలు టాప్-10లో ఉన్నాయి.
రియల్ ఎస్టేట్, టూరిజం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సలహదారుగా ఉన్న రిసోనెన్స్ సంస్థ ఈ వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలను ఈ జాబితా కోసం పరిశీలించారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, భారీ వ్యాపార మౌలిక సదుపాయాలు, అసమాన జీవన నాణ్యత… లండన్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించాయని రిసోనెన్స్ పేర్కొంది.
ఈ బెస్ట్ సిటీ సర్వే కోసం 30 దేశాలకు చెందిన 22 వేల మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. వ్యాపార మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక వైభవం, రెస్టారెంట్లు, నైట్ లైఫ్, షాపింగ్, సహజసిద్ధ, మానవ నిర్మిత పరిసరాలు… ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానత, యూనివర్సిటీలు… ఇలా అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని సర్వే నిర్వహించారు.