- పత్తి గోదాంలో భారీగా ఎగిసిన మంటలు
- ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం
- భారీ ప్రమాదం కారణంగా కుప్పకూలిన గోదాం
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడూరు గ్రామంలో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి నిల్వ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పత్తి గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
ప్రమాదం విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. భారీ ప్రమాదం కావడంతో గోదాం కుప్పకూలింది. మంటలను గమనించిన కార్మికులు గోదాం నుంచి బయటకు పరుగు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.