- అడిలైడ్ టెస్టు ఓటమితో భారత్‌కు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం
- పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా
- ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే బీజీటీ సిరీస్‌ను భారత్ ఓటమి లేకుండా ముగించాల్సిన పరిస్థితి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఇక ఈ ఓటమితో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి వెళ్లేందుకు భారత జట్టు సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఆసీస్ మూడో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకింది.
కాగా, ఈ బీజీటీ సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ ఓడినా టీమిండియా ఫైనల్ బెర్త్‌కి దారి దాదాపు మూసుకుపోయినట్లే. సో.. భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఓటమి లేకుండా ఈ సిరీస్‌ను ముగించాల్సి ఉంటుంది. ఇక ఈ మూడు మ్యాచుల్లో టీమిండియా విజయం సాధిస్తే.. ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌కి దూసుకెళ్తుంది.
ఒకవేళ రెండు మ్యాచులు గెలిచి, ఒకటి డ్రా అయినా కూడా భారత్ ఫైనల్‌కి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుతం దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఫలితంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను సౌతాఫ్రికా ఓడించాల్సి ఉంటుంది.
ఒకవేళ భారత్ బీజీటీలో ఒక్క మ్యాచ్ ఓడినా.. ఫైనల్ బెర్త్ కోసం దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక, ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక సిరీస్‌ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే పింక్‌బాల్ టెస్టులో ఓటమి తర్వాత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత ఆటగాళ్లను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు.
ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌లో సమయం వృధా చేయకుండా ఈ రెండు రోజులను (మూడు రోజుల్లోనే రెండో టెస్టు ముగిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ..) ప్రాక్టీస్ కోసం వినియోగించుకోవాలని కోరాడు. అప్పుడే మూడో టెస్టులో భారత జట్టు పుంజుకోగలదని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. కాగా, మూడో టెస్టు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.