దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ‘పాంబన్ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. భారత భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను మోదీ జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, రూ. 535 కోట్లు వెచ్చించి తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ వంతెనను నిర్మించారు.
2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది. సముద్రంలో 2.08 కి.మీ. పొడవున్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు సాగించేలా, కింది నుంచి ఓడలు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2019 మార్చి 1న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ… ఆదివారం ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. మోదీ పచ్చజెండా ఊపగానే ఈ బ్రిడ్జి పైనుంచి రామేశ్వరం-తాంబరం స్పెషల్ ట్రైన్ పరుగులు తీసింది.
శ్రీలంక నుంచి తిరిగొస్తుండగా రామసేతు దర్శన భాగ్యం కలిగింది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ శ్రీలంక పర్యటన ముగించుకుని, తమిళనాడు వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీలంక నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్న ఆయన ఓ వీడియో పంచుకున్నారు. విమానంలో వస్తూ సముద్రంలోని రామసేతును చూశానని వెల్లడించారు.
కొద్దిసేపటి క్రితం శ్రీలంక నుంచి తిరిగి వస్తుండగా… రామసేతు దర్శనం చేసుకునే అదృష్టం కలిగిందని తెలిపారు. దైవికంగా, యాదృచ్ఛికంగా… అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం జరుగుతున్న సమయంలోనే ఇది చోటుచేసుకుందని వివరించారు. ఈ రెండింటి దర్శనం చేసుకునే అదృష్టం తనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడు మనందరినీ ఐక్యం చేసే శక్తి… ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలి అని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.