Thirumala
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో హై అలెర్ట్

  • కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో భద్రత పెంపు
  • అలిపిరి, ఘాట్ రోడ్లలో వాహనాల క్షుణ్ణ తనిఖీలు
  • పోలీసు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలతో మాక్ డ్రిల్
  • ఆలయ పరిసరాల్లో అదనపు బలగాలతో నిరంతర నిఘా

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో అప్రమతమయ్యారు. భద్రతను అత్యంత కట్టు దిట్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతకు ఎలాంటి లోపం రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. తిరుమలకు ప్రధాన ప్రవేశ మార్గమైన అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతను గణనీయంగా పెంచారు. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లపై ప్రయాణించే వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు వాహనాలతో పాటు, భక్తులు తీసుకువచ్చే లగేజీని కూడా భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘాట్ రోడ్డు మధ్యలో కూడా తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసు, టీటీడీ విజిలెన్స్, ప్రత్యేక ఆక్టోపస్ బలగాలు సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్‌ను నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనే అంశాలపై ఈ డ్రిల్ సాగింది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ మాడ వీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పరిసరాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.

Related posts

వరదలపై తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తాం: ఏపీ పోలీస్ హెచ్చరిక

Ram Narayana

గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Ram Narayana

తెలుగు రాష్ట్రాలలో ఉపఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల

Drukpadam