తెలంగాణ వార్తలు

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం… సీఎం రేవంత్ రెడ్డి

రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మంగళవారం ఏర్పాటు చేసిన రైతు విజయోత్సవ సభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు, ఇతర మంత్రులు, సీఎస్ కె. రామకృష్ణారావు లతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 70 లక్షలకు పైగా రైతులకు కోటి 49 లక్షల పైగా ఎకరాలకు ప్రభుత్వం 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు జమ చేసిన నేపథ్యంలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, అండగా నిలిచిన తెలంగాణ రైతాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.భూమి కోసం భుక్తి కోసం రైతాంగ పోరాటాలు జరిగాయని, భూమి చుట్టూ మన జీవితం ముడిపడి ఉందని అన్నారు. వ్యవసాయం దండగ పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ చేయాలని గతంలో డాక్టర్ వైయస్సార్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తు అందించడంతో పాటు పెండింగ్ విద్యుత్ బకాయిలను రద్దు చేసిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతాంగం మాత్రమేనని, రైతులు, మహిళలు, తెలంగాణ ఉద్యమ కారులు, విద్యార్థులే తమ ప్రాధాన్యత అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు 20 వేల 617 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేసి రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున రైతులను రుణ విముక్తి చేశామని అన్నారు. కొనుగోలు ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని గత పాలకులు బాధ్యత నుంచి తప్పుకుంటే, ప్రజా ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయడమే కాకుండా సన్న వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లించిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం అందించిన భరోసా మేరకు తెలంగాణ రైతాంగం వరి పండించడంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలను దాటిందని, 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిందని, గతంలో తాలు పేరుతో రైతులకు 10 కిలోల వరకు కటింగ్ చేసే వారని, నేడు ఆ దోపిడినీ తమ ప్రభుత్వం పూర్తిగా నిలువరించిందని, రైతులకు మద్దతు ధర 48 గంటల్లో జమ చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. 18 నెలల కాలంలో రైతుల సంక్షేమానికి లక్షా 4 వేల కోట్ల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇందిరా మహిళ శక్తి కార్యక్రమం క్రింద క్యాంటీన్, పెట్రోల్ బంక్, రైస్ మిల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఆర్టీసీ సంస్థలో అద్దె బస్సులు వంటి అనేక వినూత్న వ్యాపారాలను మహిళలతో ప్రారంభిస్తున్నామని అన్నారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మహిళలకు మొదటి సంవత్సరం 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, హైదరాబాదులో శిల్పారామం దగ్గర నాలుగు ఎకరాల స్థలం కేటాయించి మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులు అమ్మకానికి షాపులు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల చేతిలో పెట్టామని, ఏక రూప దుస్తులను మహిళా సంఘాలతో కుట్టిస్తున్నామని అన్నారు. గోదావరి, కృష్ణా నది జలాలపై చర్చకు ప్రతిపక్ష నాయకులు ముందుకు రావాలని, అసెంబ్లీలో చర్చకు స్పీకర్ కు లేఖ రాస్తే వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అసెంబ్లీను సమావేశ పరుస్తారని అన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని, రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తామని అన్నారు.

*డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల రైతుల ఖాతాలో జమ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గొప్ప కార్యక్రమం అని, వ్యవసాయానికి ఉచిత కరెంట్, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలని మద్దతు ధర, బ్యాంకుల ద్వారా ప్రయార్టీ సెక్టార్ క్రింద రైతులకు రుణాలు పంపిణీ చేయడం, హరిత విప్లవం వంటి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని, ఇందిరమ్మ ప్రభుత్వం 21 వేల కోట్ల రుణ మాఫీ చేసిందని, రైతు కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. గత పాలకులు రైతులకు అందించే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, మద్దతు ధర, బోనస్, వడ్డీ లేని రుణాలు, పంట నష్టపరిహారం వంటి అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి కేవలం అరకొర రైతు బంధు కార్యక్రమం నిర్వహించిందని, తమ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తూనే మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టిందని అన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్నామని, మన పథకాలను ఇతర రాష్ట్రాల పాలకులు పరిశీలిస్తున్నారని, రైతాంగం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాహుల్ గాంధీ సూచనల మేరకు ఉత్తమ పాలన సాగుతుందని అన్నారు. రైతు భరోసా నిధులు జమ అయ్యాయని తెలంగాణ రైతాంగం చేసుకుంటున్న సంబరాలలో తాము భాగస్వామ్యం అవుతున్నామని అన్నారు. 25 లక్షల మంది రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 21 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి 2 లక్షల వరకు పంట రుణ మాఫీ పూర్తి చేశామని మంత్రి గుర్తు చేశారు. పంట కాలానికి పెట్టుబడి సహాయం అందించాలనే లక్ష్యంతో 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు దీనికి సహకరించిన ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి రైతు వేదిక నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రైతు వేదిక లోని రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 3 లక్షల 53 వేల మంది రైతులకు 430 కోట్ల రైతు భరోసా నేటితో పూర్తయిందని, రైతుకు పెట్టుబడి సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా సహాయంతో పాటు వ్యవసాయం లాభసాటిగా జరగాలని అన్ని రకాల మద్దతు ప్రభుత్వం రైతులకు అందిస్తుందని, అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడైనా రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా మండల అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి దృష్టికి తీసుకొని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఖమ్మం జిల్లాలో వానాకాలం దాదాపు 6 లక్షల 7 వేల ఎకరాల పంట సాగు జరుగుతుందని, దీనికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత, మండల వ్యవసాయ అధికారిణి అనురాధ, వ్యవసాయ విస్తరణ అధికారి సరిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ ఏం చెప్పిందంటే…!

Ram Narayana

కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు… 18న ఆ నలుగురి వాంగ్మూలం నమోదు!

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు విడుదల…

Ram Narayana