అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారత వంటింటిపై నేరుగా ప్రభావం చూపేలా ఉన్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ వాతావరణం నెలకొనడంతో, భారత్‌కు వంటగ్యాస్ (ఎల్‌పీజీ) తీసుకువస్తున్న రెండు భారీ ట్యాంకర్లు సముద్ర మార్గంలో నిలిచిపోయాయి. ఈ పరిణామంతో దేశంలో ఎల్‌పీజీ సరఫరాపై ఆందోళనలు మొదలయ్యాయి.
ఖతార్ నుంచి ఎల్‌పీజీ లోడ్ చేసుకుని ‘మహానది’, ‘నర్మద’ అనే రెండు భారతీయ నౌకలు స్వదేశానికి బయలుదేరాయి. అయితే, హార్ముజ్ జలసంధిలో ఇరాన్ క్షిపణులతో, అమెరికా యుద్ధనౌకలతో పహారా కాస్తుండటంతో ఈ మార్గంలో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో నౌకల కెప్టెన్లు ముందుజాగ్రత్త చర్యగా ఒమన్ తీరంలోని సురక్షిత ప్రాంతంలో ట్యాంకర్లను నిలిపివేసి, ఉద్రిక్తతలు తగ్గే వరకు వేచి చూస్తున్నారు. ఫిబ్రవరి 28న ఈ ప్రాంతంలో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారత్ తన ఎల్‌పీజీ అవసరాలలో సింహభాగం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఈ సరఫరా గొలుసుకు ఆటంకం కలగడంతో, దేశీయంగా వంటగ్యాస్ కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అధికంగా ఉండటంతో, ఈ రవాణా సమస్య సామాన్యుడిపై మరింత భారం మోపనుంది.
ఈ పరిస్థితిని భారత విదేశాంగ, నౌకాయాన మంత్రిత్వ శాఖలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత నౌకాదళం అవసరమైతే రంగంలోకి దిగడానికి సిద్ధమవుతోంది. భారత యుద్ధనౌకల రక్షణతో ఈ ట్యాంకర్లను సురక్షితంగా జలసంధి దాటించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
Save or share this story as a newspaper-style Epaper Clip: