అంతర్జాతీయం

అధ్యక్ష పదవి చాలా ప్రమాదకరం .. ఎప్పుడు చస్తామో తెలియదు: డొనాల్డ్ ట్రంప్

  • అధ్యక్ష పదవిపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
  • అదొక అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగమన్న ట్రంప్
  • కారు రేసింగ్, బుల్ రైడింగ్‌తో అధ్యక్ష పదవి పోలిక
  • ముందే తెలిసి ఉంటే ఈ రేసులో ఉండేవాడిని కాదన్న అమెరికా అధ్యక్షుడు
  • గతేడాది తనపై జరిగిన హత్యాయత్నాన్ని గుర్తుచేసుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవి అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగమని, అందులో ప్రాణాలకు గ్యారెంటీ ఉండదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వ్యాఖ్యానించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పదవిలో ఉండటం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాదకరమని తెలిపారు. ఈ సందర్భంగా కారు రేసింగ్ లేదా బుల్ రైడింగ్ వంటి ప్రమాదకరమైన క్రీడలతో అధ్యక్ష పదవిని పోల్చారు. ఆ వృత్తుల్లో లాగే ఇక్కడ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని పేర్కొన్నారు. ఇంతటి ప్రమాదం ఉందని తనకు ఎవరైనా చెప్పి ఉంటే తాను ఈ పోటీలోనే ఉండేవాడినే కాదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని పేర్కొన్నారు.

గతేడాది ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఓ సభలో ప్రసంగిస్తుండగా సమీపంలోని భవనం పైనుంచి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి గాయమైన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత కూడా తనను లక్ష్యంగా చేసుకుని పలుమార్లు దాడులకు ప్రయత్నాలు జరిగాయని ట్రంప్ పరోక్షంగా ప్రస్తావించారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్‌లో ఆయన గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి తుపాకీతో ఫెన్సింగ్ వద్దకు రాగా భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపి పట్టుకున్నారు. మరికొన్ని రోజుల తర్వాత ట్రంప్ హాజరైన సమావేశానికి సమీపంలో ఉన్న నేషనల్ కన్వెన్షన్ వద్ద, ఏకే-47 రైఫిల్‌తో సంచరిస్తున్న ఓ సాయుధ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. తనపై వరుసగా జరిగిన ఈ హత్యాయత్నాల నేపథ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతోంది.

Related posts

గాజాలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి!

Ram Narayana

ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన స్పానిష్ జంట.. చాట్ జీపీటీ తప్పుదోవ పట్టించిన వైనం!

Ram Narayana

పట్టాలపై పనిచేస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన రైలు.. చైనాలో 11 మంది దుర్మరణం..

Ram Narayana