నీటి చుక్క కూడా తెలంగాణ వాటా వదులుకునే ప్రసక్తే లేదు…. డిప్యూటీ సి.ఎం. భట్టి
కృష్ణ, గోదావరి జిల్లాల వినియోగంలో గత పాలకుల వైఫల్యం
బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అన్ని దశలలో అడ్డుకుంటుంది
22 వేల 500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
95 లక్షల రేషన్ కార్డులు, 51 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం అమలు
కృష్ణా, గోదావరి నదులలో నీటి చుక్క కూడా తెలంగాణ వాటా వదులుకునే ప్రసక్తే లేదనిడిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదివారం మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో పర్యటించి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎం.డి. లక్ష్మీ లతో కలిసి కమలాపురం గ్రామంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ* రాష్ట్రంలో 5 లక్షల 91 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ సామర్థ్యం ఉంటే, గత 20 నెలల కాలంలో గిడ్డంగుల సంస్థ ద్వారా 10 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గిడ్డంగుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని అన్నారు. సకాలంలో సాగు నీటి సరఫరా, రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక కార్యక్రమాలు అమలు చేయడం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి మన రైతులు సాధించారని అన్నారు.
నాగార్జున సాగర్ టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీటి ఇబ్బంది వల్ల మనం నష్టపోతున్నామని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం వల్ల నాగార్జున సాగర్ నిండదని, దీని వల్ల ఖమ్మం జిల్లా రైతాంగం నష్ట పోతుందని అన్నారు. గత పాలకులు కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టు కట్టలేదని అన్నారు. కృష్ణాపై జూరాల, కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి చేశాయని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టారని డిప్యూటీ సీఎం విమర్శించారు. ప్రతి రోజూ 13 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ పై భాగం నుండి రాయలసీమకు లిఫ్ట్ చేసేలా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ తీసుకునేలా చేస్తుందని, ఈ దోపిడి ఇలాగే కొనసాగితే 30 రోజులలో శ్రీశైలం ఖాళీ అవుతుందని అన్నారు. గోదావరి నదిపై ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టులను నిర్మించామని ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల పనులు చేపట్టామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు క్రింద తుమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లి నీళ్ళు తెచ్చేలా ప్రాజెక్టు డిజైన్ చేస్తే గత పాలకులు వాటిని నిర్లక్ష్యం చేశారని, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదని అన్నారు. గత బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీళ్ళు క్రిందికి వెళ్ళేవి కాదని అన్నారు. రాజకీయ విమర్శలకు తావు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును అందరం వ్యతిరేకించాలని అన్నారు. సముద్రంలో పోతున్నాయని ప్రాజెక్టు కట్టుకుంటే తర్వాత నీటి పంపిణి సమయంలో నీటి కేటాయింపులు లభిస్తాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని దశలలో బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటకు రాకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. ప్రజల నీటి హక్కులు కాపాడే బాధ్యత పాలకులపై ఉందని, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సమర్థవంతంగా వాదనలు వినిపించడం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడింది అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు, మంత్రి లోకేష్ తెలివిగా మాట్లాడుతున్నారని, మా ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత వరద నీటిలో తెలంగాణ నీటి నిల్వ అవసరాలు తీర్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం హితవు పలికారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఖమ్మం జిల్లాలో 7 మండలాలు లేకుండా విభజన చట్టం జరిగిందని, ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏ.పి. లో కలుపుతుంటే స్పందించలేదని అన్నారు. చుక్క నీటి వాటాను కూడా తెలంగాణ రాష్ట్రం వదులుకోవడానికి సిద్ధంగా లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో 95 లక్షల పేద కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, వీరికి పది లక్షల రూపాయల పరిమితి గల ఆరోగ్యశ్రీ కార్డు కూడా అందుబాటులోకి వచ్చిందని అన్నారు. 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ముదిగొండ మండలంలో 84 శాతం ఇండ్లకు గృహ జ్యోతి పథకం అమలు అవుతుందని అన్నారు.
మానవీయ కోణంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, 22 వేల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, ప్రతి వారం ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు. ఎస్సి ఎస్టి, మైనారిటీ వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేలా 104 యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలకు 21 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని, 5 సంవత్సరాల్లో లక్ష కోట్ల రుణాలు మహిళలకు అందిస్తామని అన్నారు. కమలాపురం గ్రామంలో చేపట్టిన గోదాముల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాల జారీ చేశారు.జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలతో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమని అన్నారు.గోదాముల ద్వారా రైతులు పండించే వరి, ఇతర పంటల స్టోరేజీ సమస్య తీరుతుందని అన్నారు. ఉగాది నుంచి ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తున్నదని అన్నారు. 500 రూపాయల బోనస్ వల్ల వరి ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి గోదాములు ఖమ్మం జిల్లాలో చాలా అవసరం పడతాయని, మరింత విస్తరణ దిశగా ప్రణాళికలు తయారు చేస్తామని అన్నారు. ముదిగొండ చుట్టు పక్కల రైతులకు ఈ గోదాములు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎం.డి. లక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రంలో 51 సొంత గోడౌన్ లు ఉన్నాయని, దీంతో పాటు స్టోరేజ్ కోసం ప్రైవేట్ గోదాంలను కూడా వినియోగిస్తున్నా మని అన్నారు. ప్రతి జిల్లాలో అదనంగా గోదాం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డిమాండ్ ఉన్న చోట వెంటనే భూ కేటాయింపులు చేసుకొని అదనపు వేర్ హౌసింగ్ నిర్మిస్తున్నామని అన్నారు.
అనంతరం డిప్యూటీ సీఎం పెదమండవ గ్రామం ఎస్సీ కాలనీలో 58.50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, తెలంగాణ హస్త కళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అబ్దుల్ అలీమ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు, ప్రజలు, సాంస్కృతిక సారథి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.