- ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సోరెన్
- తండ్రి మరణాన్ని ధ్రువీకరించిన కుమారుడు, సీఎం హేమంత్ సోరెన్
- ఝార్ఖండ్ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన గిరిజన నేత
ఝార్ఖండ్ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబు సోరెన్ (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నెల రోజుల క్రితం స్ట్రోక్‌కు గురైనప్పటి నుంచి ఆయన లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు. తన తండ్రి మరణవార్తను ఆయన కుమారుడు, ప్రస్తుత ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. “గౌరవనీయులైన దిశోమ్ గురు మనందరినీ విడిచి వెళ్లిపోయారు. ఈ రోజు నేను ఒంటరినైపోయాను…” అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు.
ప్రజలు “గురూజీ” అని, “దిశోమ్ గురు” అని ప్రేమగా పిలుచుకునే శిబు సోరెన్, ఝార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన మూడుసార్లు సీఎంగా, ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగానూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గిరిజన హక్కుల కోసం, ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన సాగించిన పోరాటం చారిత్రాత్మకమైనది. ఈ కారణంగానే ఆయనను “ఆధునిక ఝార్ఖండ్ పితామహుడు”గా గౌరవిస్తారు.
1944లో నేటి ఝార్ఖండ్‌లోని నేమ్రా గ్రామంలో శిబు సోరెన్ జన్మించారు. ఆయన తండ్రి, ఓ పాఠశాల ఉపాధ్యాయుడు. వడ్డీ వ్యాపారుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసిన సోరెన్, 18 ఏళ్ల వయసులోనే గిరిజన యువతను సమీకరించేందుకు “సంథాల్ నవయువక్ సంఘ్”ను స్థాపించారు. ఇదే ఆ తర్వాత ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఆవిర్భావానికి పునాది వేసింది. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
హేమంత్ సొరెన్ ను దగ్గరకు తీసుకుని ఓదార్చిన ప్రధాని మోదీ…!

- ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సొరెన్ కన్నుమూత
- అనారోగ్యంతో ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస
- ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ
- హేమంత్ సొరెన్ కు పరామర్శ
తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన్ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని, భుజం తట్టి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. రాజకీయాలకు అతీతంగా ప్రధాని చూపిన ఈ ఆత్మీయత అందరినీ కదిలించింది.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరెన్ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘గురూజీ’గా పేరుగాంచిన ఆయన మరణంతో ఝార్ఖండ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
శిబూ సొరెన్ మరణవార్త తెలియగానే ప్రధాని మోదీ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ శిబూ సొరెన్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా కుమారుడు హేమంత్ సొరెన్‌ను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కన్నీటిపర్యంతమైన హేమంత్‌ను ప్రధాని మోదీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. శిబూ సొరెన్ మరణం తీరని లోటని అన్నారు. గిరిజన వర్గాల సంక్షేమం కోసమే శిబూ సొరెన్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆ సేవలకు ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో సొరెన్ కుటుంబానికి, ఆయన అనుచరులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.