జాతీయ వార్తలు

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ మహాధర్నా ..

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న కేసీఆర్, రామచందర్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి మనకు సవాల్ కాదని మన పోటీ ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీలోని భారత ప్రభుత్వం మీద అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

మోడీ మెడలు వంచైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకే జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పోరుబాట పట్టామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన బీసీ మహాధర్నాలో మాట్లాడిన రేవంత్ రెడ్డి..

అయ్యా ప్రధాని మోడీ గారు.. మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగడం లేదు. మీ పోరుబందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలేదు. మా తెలంగాణ గడ్డమీద మా బలహీన వర్గాల ప్రజలకు మేము 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాతోళ్లకు వచ్చిన కడుపు మంట ఏమిటని ప్రశ్నించారు. జంతర్ మంతర్ వద్ద నుంచి నేను సవాల్ విసురుతున్నా.. మోడీ , ఎన్డీయే ప్రభుత్వం మా డిమాండ్ ను ఆమోదిస్తారా? లేక ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా చేసి ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుంటాం అన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ ముక్తకంఠంతో 4 కోట్ల తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలు, మా బిల్లలను తుంగలో తొక్కే అధికారం ఎవరిచ్చారని మోడీని, బీజేపీని సీఎం ప్రశ్నించారు. నరేంద్ర మోడీ మా బద్ధ శత్రువు అని బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదన్నారు. మోడీ ఆలోచనలు ఎలా ఉన్నా మోడీ మోచేతి నీళ్లు తాగే రామచందర్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఏం పోయే కాలం వచ్చిందని ప్రశ్నించారు. మీరు మళ్లీ తెలంగాణకు రారా? తెలంగాణ బలహీనవర్గ ప్రజల ఓట్లు మళ్లీ అడగరా? తెలంగాణ ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్ హామీ ఇచ్చారు. కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో దీనిపై భరోసా ఇచ్చాం. దేశంలో గతంలో ఏ సీఎం చేయని సాహసం మేం చేసి చూపించాం. కులగణనతో చరిత్రలో నిలిచిపోయే అవకాశం నాకు దక్కిందన్నారు.

బీఆర్ఎస్ పేగు బంధం తెగిపోయిందా?
మా దీక్షను కేటీఆర్ డ్రామా అని అంటున్నారు. కానీ కేటీఆర్ పేరులోనే డ్రామా ఉంది. నీ ఇంట్లో, ఒంట్లో, నీ రక్తంలోనే డ్రామా ఉందని డ్రామాలు వేసుకుంటునే నీ కుటుంబం బతుకుతోందని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. మీ ఇంట్లోనే ఒకరు బీసీలకు అనుకూలం అంటే మరొకరు వ్యతిరేకిస్తున్నారు. మూడో వ్యక్తి మధ్యస్థం అంటున్నారు. అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడుతున్నాడు..!!! అంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు మోడీ మోచేతి నీళ్లు తాగి బతకొచ్చు. మరి బీఆర్ఎస్ వాళ్లు మోడీ చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకు అండగా నిలబడకుండా మోడీతో ఎందుకు అంటకాగుతున్నారని నిలదీశారు. మీకు తెలంగాణతో పేరు బంధంతో పాటు ఇక పేగు బంధం కూడా తెగిపోయిందా? అని ప్రశ్నించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు రాలేదని నిలదీశారు. మన దీక్ష బీఆర్ఎస్ వాళ్లకు డ్రామాలా కనిపిస్తోందా అని బీసీలను అడిగారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే వందేళ్ల సమస్యకు ఏడాదిలో పరిష్కారం చూపించామన్నారు. నువ్వా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేంది? నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాళకోరుతనం బండకేసి కొట్టినా? మీ బుద్ధిమారలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ బలహీనవర్గాలపై కక్షతో 50 శాతం మించకుండా చట్టం చేశారని కేసీఆర్ చేసిన చట్టం గుదిబండగా మారిందన్నారు.

దేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ సునామీ..

కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరని తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయిందన్నారు. కులగణన, 42 శాతం రిజర్వేషన్లతో ఈ తెలంగాణ మోడల్ దేశ రాజకీయాల్లో సునామీ సృష్టించబోతున్నదని ఈ సునామీలో ఎన్డీయే బంగాళాఖాతంలో కలిసిపోతుందని మోడీ కుర్చి దిగిపోబోతున్నారని అన్నారు. నరేంద్ర మోడీని అటల్ బిహార్ వాజ్ పేయి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా కాలంగా చూస్తున్నారు. కానీ మోడీ మీరు కుర్చీ దిగొద్దు. వాజ్ పేయ్, ఆర్ఎస్ఎస్ చేయలేని పనిని 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో మోడీని గద్దెదించుతామన్నారు. ఇదే మా శపథం అని జంతర్ మంతర్ సాక్షిగా చెబుతున్నాన్నారు. మోడీ లేకుంటే బీజేపీకి 150 సీట్లు కూడా రావని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అంటున్నారు. కానీ నిశికాంత్ దూబే మీరు డైరీలో రాసుకోండి. మోడీ పేరుతోనే మీరు వచ్చే ఎన్నికలకు రావాలని 150 కంటే ఒక్క సీటుకూడా ఎక్కువ రానివ్వమన్నారు.

రాహుల్ మాటకు ఎదురొస్తే మరణశాసనమే:
ఇవాళ మోడీకి ఉన్న మార్గం ఒక్కటే. గద్దెమీదుంటే మా బీసీ బిల్లులు ఆమోదించండి. లేదా మిమ్మల్ని గద్దె దించే 42 శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. మోడీ, బీజేపీ నాయకులు తెలంగాణ ప్రజల పోరాట శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఓబీసీలకు కులగణన చేసి రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ కంకణబద్దుడై బయలుదేరారు. దేశం నలుమూలలుగా ఇది ఎజెండాగా మారింది. తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. రాహుల్ గాంధీ మాటే శిలాశాసనంగా మారింది. దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాది, మా మంత్రి మండలిది. ఎవరైనా రాహుల్ గాంధీ శిలాశాసనానికి ఎదురొస్తే వారి పాలిట మరణశాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతున్నదన్నారు. మేము పంపిన రెండు బిల్లులు తక్షణమే ఆమోదించాలి. మేము పంపిన ఆర్డినెన్స్ ను ఆమోదించండి. లేదా ఇక మళ్లీ మేము ఢిల్లీ వచ్చేది ఉండదని మీరు మా గల్లీకి వస్తారు కదా అక్కడే పట్టుకుంటామన్నారు.

Related posts

హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారు: ఉగ్రదాడిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

Ram Narayana

వైష్ణోదేవి ఆల‌యంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం… తుపాకీతో లోప‌లికి ప్ర‌వేశించిన మ‌హిళ‌…

Ram Narayana

 దలైలామా భారత్ లో ఉండడం మా అదృష్టం : కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

Ram Narayana