ఆంధ్రప్రదేశ్

ఘర్షణలు ,ఆరోపణలు అరెస్టులు మధ్య పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక …

తీవ్ర ఉద్రిక్తతల నడుమ… ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ పోలింగ్

  • ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత
  • జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సహా నేతలు కేంద్రంలోకి చొరబాటు
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు, ఆందోళనకారుల చెదరగొట్టారు
  •  రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు

వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. నిర్ణీత సమయానికి క్యూలైన్లలో నిలబడి ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికే పులివెందులలో 71.36 శాతం, ఒంటిమిట్టలో 66.39 శాతం ఓటింగ్ నమోదైంది.

ఈ ఉప ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించింది. పులివెందులలో టీడీపీ తరఫున బీటెక్ రవి అర్ధాంగి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ తరఫున హేమంత్‌రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం రెడ్డి పోటీ పడ్డారు. రెండు చోట్లా మొత్తం 11 మంది చొప్పున అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

కాగా, ఒంటిమిట్టలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ కె. రవీంద్రనాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో వారు పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న బారికేడ్లు, కుర్చీలను తోసివేయడంతో అక్కడ గందరగోళం చెలరేగింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైసీపీ నేతలను చెదరగొట్టి, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.

పులివెందుల పోలింగ్ వేళ టెన్షన్.. ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్!

Avinash Reddy Arrested Amid Tension at Pulivendula Polling
  • పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్
  • రెండు మండలాల్లో 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత
  • సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్
  • టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా సాగుతున్న పోటీ

వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ రోజున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు ఈ ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేశారు. పులివెందులలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంతో పాటు ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష కూటములు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకుని, మొదట ఆయన మద్దతుదారులను అక్కడి నుంచి పంపించి, అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ అవినాశ్ రెడ్డి తన నివాసం వద్ద కొద్దిసేపు నిరసనకు దిగారు.

ఈ ఉప ఎన్నికల కోసం రెండు మండలాల పరిధిలో సుమారు 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానం కోసం మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్యే నెలకొంది. ఈ రెండు మండలాల్లో కలిపి మొత్తం 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పులివెందుల ఉప ఎన్నికకు వైసీపీ రూ. 100 కోట్లు ఖర్చు చేసింది: బీటెక్ రవి

పోలింగ్ ప్రారంభమైన తర్వాత టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు వైసీపీ రూ. 100 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఓటుకు రూ. 5 వేల చొప్పున వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు. మహిళలకు చీరలు, ముక్కు పుడకలు పంపిణీ చేశారని దుయ్యబట్టారు. ఐదేళ్ల పాటు అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుపు కోసం కుమ్మరిస్తున్నారని ఆరోపించారు. 

 పులివెందుల ప్రజలు వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారు: పల్లా శ్రీనివాసరావు

TDP Leader Palla Predicts YSRCPs Defeat in Pulivendula

టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..

ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరుగుతుంటే… తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా బాధపడుతోందని పల్లా ఎద్దేవా చేశారు. ఏదో రకంగా ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు వైసీపీ పసలేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ‘సేవ్ డెమోక్రసీ’ అంటూ గగ్గోలు పెడుతూ ఓటర్ల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఓటర్లు వీరి కుయుక్తులను పసిగట్టారని… వీరికి దిమ్మతిరిగే తీర్పును ఇవ్వబోతున్నారని చెప్పారు. 

పులివెందుల, ఒంటిమిట్ట రెండు స్థానాలు కూటమి ఖాతాలోకి చేరబోతున్నాయని పల్లా ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రజల సహకారం పూర్తిగా ఉంటుందని విశ్వసిస్తున్నానని అన్నారు.

పులివెందుల ఉప ఎన్నిక.. ఓటు వేసేందుకు వెళుతున్న టీడీపీ వర్గీయుల కారు ధ్వంసం

TDP activists car damaged in Pulivendula election violence

పులివెందుల మండలం కణంపల్లెలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు కారులో వెళుతున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ కు బయల్దేరారు.

పులివెందుల బై ఎలక్షన్… విజయవాడలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన

YSRCP Protests at Election Commission Office Over Pulivendula By Election
  • టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందంటూ ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ నేతల నినాదాలు
  • టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందంటూ విజయవాడలోని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ అరాచకాలపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. 

టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ యత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ… వారిని పోలింగ్ బూత్ లకు రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు పాల్గొన్నారు.

జగన్ పనైపోయిందని చెప్పే కుటిల ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలను తన చరిత్రలో చూడలేదని అన్నారు. ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుని వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఖాళీ స్థానాల్లో కాకుండా… కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారని… ఈ స్థానాల్లో గెలిచి జగన్ పనైపోయిందని చెప్పే కుటిల ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఓటరు స్లిప్పులను లాక్కొని, వాళ్ల మనుషులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని అంబటి విమర్శించారు. గతంలో నంద్యాలలో ఇలాగే చేసి గెలిచారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రజాప్రతినిధులను కూడా ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని మండిపడ్డారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. టీడీపీ, ఈసీ, పోలీసులు కలిసిపోతే చేసేదేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దుర్మార్గాలను అర్థం చేసుకుని ప్రజలు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.

కాల్చి పడేస్తా… వైసీపీ కార్య‌క‌ర్త‌లకు డీఎస్పీ వార్నింగ్‌..

Koya Praveen DSP warns YSRCP leaders in Pulivendula video goes viral
  • కొన‌సాగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల‌ పోలింగ్
  • ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి నిర్బంధంతో పులివెందులలో ఉద్రిక్తత‌
  • పులివెందుల వైసీపీ కార్యాల‌యానికి త‌ర‌లివ‌చ్చిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు
  • వారిని అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌ని కోరిన పోలీసులు
  • ఈ క్ర‌మంలో పోలీసుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు వాగ్వాదం
  • ఆగ్ర‌హానికి గురైన డీఎస్పీ మురళీ నాయక్… వైసీపీ కార్యకర్తలపై ఫైర్  

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల‌ పోలింగ్ కొన‌సాగుతోంది.  పులివెందులలోని వైసీపీ కార్యాలయం వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్పీ మురళి నాయక్, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ కొంతసేపు గందరగోళం ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే, పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు డీఎస్పీ మురళి నాయక్ భారీ పోలీసు బలగాలతో వైసీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులతో పార్టీ కార్యాలయం వద్దకు రావడంతో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. తమ నాయకుడికి ఏదో జరుగుతుందనే ఆందోళనతో పెద్ద సంఖ్యలో అక్కడికి పరుగులు తీశారు.

దీంతో అక్కడ ఒక్కసారిగా జనం గుమిగూడారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు డీఎస్పీ మురళి నాయక్ ప్రయత్నించారు. గుంపుగా ఉన్న కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ నేప‌థ్యంలో ఆగ్ర‌హానికి గురైన డీఎస్పీ మురళి నాయక్ వైసీపీ కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. “కాల్చిపడేస్తా నా కొ..కా.. నువ్వు తాగి మాట్లాడొద్దు… ఏమనుకుంటున్నావ్‌.. యూనిఫాం ఇక్కడ!” అంటూ గ‌ట్టిగా హెచ్చ‌రించారు. డీఎస్పీ వార్నింగ్ తాలూకు వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

‘కాల్చి పారేస్తా’ అన్న పులివెందుల డీఎస్పీపై అంబటి రాంబాబు ఫైర్

Ambati Rambabu Criticizes DSPs Behavior in Pulivendula

డీఎస్పీ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీఐజీ ప్రవీణ్ అండగా ఉన్నారని అహంకారమా? అని మండిపడ్డారు. కార్యాలయంలో ఓవైపు ఎంపీ ఉండగానే… బయట కార్యకర్తలను కాల్చిపారేస్తాను అనడం డీఎస్పీ అహంకారానికి నిదర్శనమని అన్నారు. టీడీపీని గెలిపించడానికే ఖాకీ దుస్తులు వేసుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ బదులు పచ్చ చొక్కాలు వేసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

కేవలం రెండు జడ్పీటీసీల కోసం చంద్రబాబు ఇంత దారుణాలకు ఒడిగట్టాలా? అని అంబటి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు వందేళ్ల వెనుకకు తీసుకెళ్లారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రారంభించిన ఈ సంప్రదాయం ఆయనను, ఆయన కుమారుడిని వెంటాడదా? అని వ్యాఖ్యానించారు. ఈరోజు జరిగిన పరిణామాలతో వైసీపీ కార్యకర్తల గుండెలు మండిపోతున్నాయని చెప్పారు.

Related posts

తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష కీ విడుదల.. 31న ఉదయం నుంచి అభ్యంతరాల స్వీకరణ..

Drukpadam

ఖమ్మంలో మంత్రి అజయ్ చొరవ జర్నలిస్ట్ లకు వ్యాక్సినేషన్ కు ప్రత్యేక కౌంటర్

Drukpadam

హిజాబ్ పై తీర్పు.. చంపేస్తామంటూ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ కు బెదిరింపు!

Drukpadam