గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి …రాజ్యసభలో వద్దిరాజు రవిచంద్ర
బీఆర్ యస్ హయాంలో కేసీఆర్ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించారన్న వద్దిరాజు
క్రీడలు,క్రీడాకారులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పదేళ్ల పాలనలో తగు ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు .కేసీఆర్ ప్రోత్సాహంతో బాడ్మింటన్ లో గోపీచంద్, టెన్నిస్ లో సానియా మీర్జా,బాక్సింగ్ లో నిఖత్ జరీనా, క్రికెట్ లో సిరాజ్,తన సొంత జిల్లా మహబూబాబాద్ కు చెందిన సాధుల మేఘన షూటింగ్ లో,ఆకుల శ్రీజ తదితరులు అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభాపాటాలు చాటి చెప్పారని,బాగా రాణిస్తున్నారని ఎంపీ రవిచంద్ర వివరించారు.
క్రీడల నిర్వహణలో లోపాలు, అంతర్గత అధికార పోరు తగ్గించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను జాతీయ క్రీడా పాలన బిల్లు – 2025, ఉత్ప్రేరకాల నిరోధక బిల్లు -2025లను యువజన,క్రీడల శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,క్రీడలను రోజువారీ జీవితంలో భాగం చేయడం,స్టార్టప్‌లను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాల నుండి భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు దోహదపడే ఈ బిల్లులకు తమ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు.తమ నాయకులు కేసీఆర్ 400కోట్లు కేటాయించి 33 జిల్లా కేంద్రాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలలో స్టేడియంలు నిర్మించడం జరిగిందన్నారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లో 2161 కోట్లు కేటాయించగా,ఇందులో తెలంగాణకు కేవలం 17 కోట్లు మాత్రమే ఇవ్వడం విచారకరమన్నారు.క్రీడల్లో పారదర్శకత, న్యాయం, ప్రతిభ ప్రధానంగా నిలిచే భవిష్యత్తును నిర్మించడానికి జాతీయ క్రీడల పాలన బిల్లు -2025 సమయోచితమైన చట్టం అని ఆయన పేర్కొన్నారు.
ఈ బిల్లుల వల్ల దేశంలో క్రీడలు,క్రీడాకారులకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందన్న ఆశాభావాన్ని ఎంపీ రవిచంద్ర వ్యక్తం చేశారు.
ఈ బిల్లుతో జాతీయ ఒలింపిక్,పారా ఒలింపిక్ కమిటీలు, జాతీయ,ప్రాంతీయ క్రీడల సమాఖ్యలు ఏర్పాటు చేస్తూ,వాటికి గుర్తింపుని వ్వడం, పర్యవేక్షించడం, అవసరమైతే గుర్తింపును రద్దు చేయడం, నిలిపివేయడం వంటి అధికారాలు సంక్రమిస్తాయని ఎంపీ వద్దిరాజు తెలిపారు.
అలాగే, అన్ని క్రీడా సంస్థల్లో స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగడం కోసం జాతీయ క్రీడల ఎన్నికల ప్యానెల్ ఏర్పాటవుతుందని, ఈ సంస్థలు కఠినమైన నియమావళి పాటించే విధంగా పర్యవేక్షణ ఉంటుందన్నారు. దీని వల్ల అనవసర జోక్యం తగ్గి, అంతర్గత వ్యవస్థ మెరుగై, క్రీడా పరిపాలన ప్రతిష్ఠ కాపాడబడుతుందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
క్రీడాకారుల రక్షణ, సంక్షేమానికి ఈ బిల్లులో ప్రాధాన్యత కల్పించడం అభినందనీయమన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం “సేఫ్ స్పోర్ట్స్ పాలసీ తో క్రీడాకారులు తమ ప్రదర్శనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని,వారి హక్కులు, గౌరవం కాపాడబడతాయన్నారు.
ఈ బిల్లులో అత్యంత ప్రగతిశీల అంశం జాతీయ క్రీడల ట్రైబ్యునల్ ఏర్పాటు, ఇది మాజీ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో క్రీడలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే స్వతంత్ర సంస్థగా ఉంటుందన్నారు.దీని ద్వారా వేగవంతమైన, తక్కువ ఖర్చుతో, నిపుణుల నిర్ణయం లభించి, సివిల్ కోర్టులపై భారం తగ్గుతుందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మరిన్ని క్రీడా పాఠశాలలు స్థాపించాలని,యువ క్రీడాకారుల శిక్షణకు పటిష్టమైన పునాది ఏర్పర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సలహా నిచ్చారు.
ఈ క్రీడా విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్ కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన విజేతలకు దేశంలోనే అత్యధిక నగదు బహుమతులిచ్చి ప్రోత్సహించటం జరుగుతుందన్నారు.
గ్రామీణ క్రీడల అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం ఉండేలా, వార్షిక క్రీడా కార్యక్రమాలు నిర్వహించేలా కృషి చేయాలన్నారు.చిన్న వయసులోనే పిల్లలు క్రీడలలో పాల్గొనేలా ఈ విజన్ సహకరిస్తోందని ఎంపీ వద్దిరాజు తెలిపారు.పలు రకాల క్రీడా కిట్లను పంపిణీ చేపట్టాలని,ఈ బిల్లును ఆమోదించి, యువతకు అవసరమైన వాతావరణం, వనరులు, అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.హైదరాబాద్ నగరంలో డోపింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని,క్రీడాకారులకు పోషకాహారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.క్రీడలు ఒక శక్తివంతమైన, ఐక్య, ఆరోగ్యకరమైన దేశ నిర్మాణానికి దోహదపడుతాయని ఎంపీ రవిచంద్ర చెప్పారు.