- ప్రజల సమస్యలు వినేందుకు సీఎం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమం
- సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన 30 ఏళ్ల యువకుడు
- ఖండించిన బీజేపీ నేతలు
- ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదన్న మాజీ సీఎం అతిశీ
ఢిల్లీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత రేఖా గుప్తాపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ప్రజల సమస్యలు విని పరిష్కరించేందుకు సీఎం రేఖా గుప్త వారంవారం ‘జన్ సున్ వాయి’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేఖా గుప్త ప్రజలను కలుస్తారు. ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమంలో భాగంగా రేఖా గుప్త ప్రజల సమస్యలు తెలుసుకుంటుండగా 30 ఏళ్ల యువకుడు ఒకరు ఈ దాడికి పాల్పడ్డాడు. ఇతనిని గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన రాజేశ్ సకారియాగా గుర్తించారు.
తన సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించిన దుండగుడు కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించాడు. అనంతరం ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొట్టాడని అధికారవర్గాల సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతాసిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీఎంను వైద్యులు పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రిపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్, మంత్రి మజిందర్ సింగ్ సిస్రా, ఇతర నేతలు ఈ దాడి వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కాగా, ముఖ్యమంత్రిపై దుండగుడి దాడి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ స్పందించారు. సీఎంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదని ఆమె పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. భద్రతా వైఫల్యంపైనా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రికే ఈ పరిస్థితా?.. రేఖా గుప్తాపై దాడి ఘటనపై విపక్షాల ఫైర్

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఈ ఉదయం ఓ వ్యక్తి బహిరంగంగా దాడికి పాల్పడ్డాడు. ప్రజా సమస్యలు వింటున్న సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసంలో సీఎం రేఖా గుప్తా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో, సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక కాగితాన్ని అందించాడు. వెంటనే గట్టిగా అరుస్తూ, దుర్భాషలాడుతూ ఆమె చెంపపై కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన రాజేశ్ సకారియాగా ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ దాడి ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. “ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే, ఇక సామాన్య మహిళల భద్రత పరిస్థితి ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడి రాజధానిలో మహిళల భద్రత ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కూడా ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు.
తనపై జరిగిన దాడి ఘటనపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా
- దాడిపై తొలిసారిగా ఎక్స్ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి
- ఇది ఒక పిరికిపంద చర్య అంటూ తీవ్ర వ్యాఖ్యలు
- ప్రజలకు సేవ చేయాలన్న తమ సంకల్పంపై జరిగిన దాడి అని వెల్లడి
- దాడితో షాక్‌కు గురయ్యానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని స్పష్టం
తనపై జరిగిన దాడి ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. ఈ దాడిని ఆమె ఒక ‘పిరికిపంద చర్య’గా అభివర్ణించారు. ఇది కేవలం తనపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలన్న తమ ప్రభుత్వ సంకల్పంపై జరిగిన దాడి అని ఆమె వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన కొన్ని గంటల అనంతరం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
బుధవారం ఉదయం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సమయంలో రేఖా గుప్తాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ, “ఈ ఉదయం నాపై జరిగిన దాడి కేవలం నాకు మాత్రమే సంబంధించినది కాదు. ఢిల్లీకి, ప్రజల సంక్షేమానికి సేవ చేయాలన్న మా దృఢ సంకల్పంపై జరిగిన పిరికిపంద ప్రయత్నం ఇది” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటనతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె పేర్కొన్నారు. “దాడి తర్వాత నేను సహజంగానే షాక్‌కు లోనయ్యాను. కానీ ఇప్పుడు నేను కోలుకుంటున్నాను, బాగానే ఉన్నాను. ప్రజాసేవ చేయాలనే నా సంకల్పాన్ని ఇటువంటి ఘటనలు దెబ్బతీయలేవు. ప్రజల నమ్మకం, మద్దతు నాకు కొండంత అండ. ఇప్పుడు మరింత ఉత్సాహంతో, అంకితభావంతో ప్రజల మధ్య ఉంటాను. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కారం అదే నిబద్ధతతో కొనసాగుతాయి” అని ఆమె తన పోస్ట్‌లో జోడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి కేసులో కీలక ఆధారం

- దాడికి ముందు రెక్కీ నిర్వహించిన నిందితుడు.. బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్
- ముఖ్యమంత్రి నివాసం వద్ద వీడియో తీసిన నిందితుడు రాజేష్
- ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడేనంటున్న మంత్రులు
- నిందితుడికి నేర చరిత్ర.. గుజరాత్‌లో పలు కేసులు నమోదు
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని, పక్కా ప్రణాళికతోనే జరిగిందన్న వాదనలకు బలం చేకూర్చే కీలక ఆధారం పోలీసులకు లభించింది. దాడికి పాల్పడిన నిందితుడు రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియా, ఘటనకు ఒక రోజు ముందు ముఖ్యమంత్రి నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డయింది.
బుధవారం సివిల్ లైన్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ‘జన సున్వాయి’ కార్యక్రమం నిర్వహిస్తుండగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల రాజేష్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులకు ఆగస్టు 19వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజ్ లభించింది. ఈ వీడియోలో నిందితుడు రాజేష్.. షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం పరిసరాలను పరిశీలించడమే కాకుండా, తన ఫోన్‌లో వీడియో కూడా రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ దాడి వెనుక కుట్ర కోణం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
మరోవైపు, నిందితుడు రాజేష్‌కు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతనిపై రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. వాటిలో నాలుగు కేసుల నుంచి నిర్దోషిగా బయటపడగా, మరో కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ సెప్టెంబర్ 9న జరగనుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, దాడి కచ్చితంగా ముందస్తు ప్రణాళికతో జరిగిందేనని ఢిల్లీ మంత్రులు పర్వేష్ వర్మ, మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపిస్తున్నారు. నిందితుడు ముఖ్యమంత్రి జుట్టు పట్టుకుని కింద పడేశాడని, వెంటనే భద్రతా సిబ్బంది, స్థానికులు అప్రమత్తమై ఆమెను రక్షించారని వారు తెలిపారు. ఇంతటి భద్రత నడుమ ఈ దాడి జరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భద్రతా వైఫల్యంపై అంతర్గత విచారణ జరుపుతామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. నిందితుడిని లోతుగా విచారిస్తున్న పోలీసులు, దాడికి గల అసలు కారణాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం గుజరాత్ పోలీసులను కూడా సంప్రదించారు.
దాడికి గల కారణాలపై భిన్న వాదనలు
ముఖ్యమంత్రిపై సకారియా ఎందుకు దాడి చేశాడనే విషయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నిందితుడి బంధువు జైల్లో ఉన్నాడని, అతడిని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేందుకు సీఎం అధికారిక నివాసానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వీటిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.
గుజరాత్‌లో నిందితుడి తల్లిని ప్రశ్నించిన అధికారులు, వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తన కొడుకు ఢిల్లీ ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్లుగా సమాచారం. అయితే అతడు జంతు ప్రేమికుడని, ఇటీవల వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. అతని మానసిక పరిస్థితి బాగాలేదని కూడా తెలుస్తోంది.