భారీ వర్షాలు, వరదలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే

- వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు విహంగ వీక్షణం
- ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి
- వరద ప్రవాహాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి
గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది …పంటపొలాలు దెబ్బతిన్నాయి…చెరువులు , కుంటలకు గండ్లు పడ్డాయి…ప్రధానంగా కామారెడ్డి , నిజామాబాద్ , నిర్మల్ , ఖమ్మం జిల్లాల్లో వర్షం భీభత్సవం సృష్టించింది …కామారెడ్డి సమీపంలో రైలు కట్ట తెగిపోవడంతో ఆప్రాంతంలో నడిచే రైళ్లను రద్దు చేసి , అక్కడ యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 13 .6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది ..
రాష్ట్రంలో పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ .రేవంతరెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు …అనంతరం ఏరియల్ సర్వే చేసి సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు … ఈ సమీక్షా సమావేశంలో సీఎం తోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు …సహాయక చర్యలకు ఆర్మీ రంగంలోకి దిగింది …హెలికాఫ్టర్ల ద్వారా సహాయక చర్యలను ముమ్మరం చేశారు ..
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఏరియల్ సర్వే అనంతరం ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి, వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా నీటిమట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
సిరిసిల్లలో వరద బీభత్సం.. హెలికాప్టర్లతో ఐదుగురిని కాపాడిన ఆర్మీ

- రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ఐదుగురి రక్షణ
- రంగంలోకి దిగిన రెండు సైనిక హెలికాప్టర్లు
- కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో వేగవంతమైన సహాయక చర్యలు
- రక్షణ మంత్రి రాజ్‍నాథ్ సింగ్‌కు బండి సంజయ్ విజ్ఞప్తి
- రెస్క్యూకు ముందు డ్రోన్లతో బాధితులకు ఆహారం అందించిన అధికారులు
- అత్యవసర సేవల కోసం సిరిసిల్లలోనే రెండు హెలికాప్టర్ల మకాం
తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురిని సైనిక హెలికాప్టర్లు గురువారం రక్షించాయి. గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద బుధవారం నుంచి వరద ఉధృతిలో చిక్కుకున్న వీరిని రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పశువులను మేపేందుకు వెళ్లిన ఈ ఐదుగురు గ్రామస్థులు, అకస్మాత్తుగా పెరిగిన వరద ప్రవాహానికి చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే స్పందించారు. ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి, బాధితులను కాపాడేందుకు తక్షణమే హెలికాప్టర్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ అభ్యర్థనపై రాజ్‌నాథ్ సింగ్ వెంటనే స్పందించి, సహాయక చర్యల కోసం రెండు హెలికాప్టర్లను పంపాలని రక్షణ శాఖ అధికారులను ఆదేశించారు.
హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గీతే ఆధ్వర్యంలో అధికారులు డ్రోన్ల సహాయంతో బాధితులకు ఆహార పొట్లాలు, నిత్యావసరాలను అందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బుధవారం బాధితులతో ఫోన్‌లో మాట్లాడి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ధైర్యం చెప్పారు.
సహాయక చర్యల సమన్వయంపై ఐఏఎఫ్ ఎయిర్ కమోడోర్ వి.ఎస్. సైనీ, గ్రూప్ కెప్టెన్ చటోపాధ్యాయలతో బండి సంజయ్ సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్ల రాక ఆలస్యమైందని, నాందేడ్, బీదర్ వంటి ప్రత్యామ్నాయ కేంద్రాల నుంచి వాటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని వారు వివరించారు. సహాయక చర్యలు పూర్తయినప్పటికీ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ రెండు హెలికాప్టర్లు సిరిసిల్లలోనే ఉంటాయని మంత్రి తెలిపారు. తక్షణమే స్పందించి సహాయం అందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వరదల్లో చిక్కుకున్న 30 మంది.. రాజ్ నాథ్ సింగ్‌కు బండి సంజయ్ ఫోన్!
- తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
- కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో చిక్కుకుపోయిన 30 మంది బాధితులు
- రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు ఫోన్ చేసిన బండి సంజయ్
- బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్ పంపాలని విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రక్షణ మంత్రి
- రాష్ట్రానికి సాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరద ఉధృతికి సుమారు 30 మంది నీటిలో చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌ను సహాయక చర్యల కోసం రంగంలోకి దించుతున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న వరద తీవ్రతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన రాజ్ నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వరద నీటిలో చిక్కుకున్న 30 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణమే వైమానిక దళ హెలికాప్టర్‌ను పంపాలని కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై రక్షణ మంత్రి వెంటనే సానుకూలంగా స్పందించారు.
రాజ్ నాథ్ సింగ్ ఆదేశాల మేరకు, రక్షణ మంత్రి కార్యాలయం హకీంపేటలోని వైమానిక దళ అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌ను సిద్ధం చేసి, వరద ప్రభావిత ప్రాంతాలకు పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో, వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఉప్పొంగుతున్న జంపన్న వాగు..!

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు పొంగుతున్నాయి. ములుగు జిల్లాలోని మేడారం వద్ద జంపన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనను ఆనుకొని వరద ప్రవాహం కొనసాగుతోంది.