జాతీయ వార్తలు

ఆయుధాలు వదిలేస్తాం.. శాంతి చర్చలకు సిద్ధం: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన…

  • మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన
  • ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నిన్న రాత్రి వెలుగులోకి 
  • నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి, గాలింపు చర్యలను నిలిపివేయాలని వినతి

భారతదేశంలో పలు రాష్ట్రాల్లో సాయుధ పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీ తాత్కాలికంగా ఆయుధాలను విడిచిపెట్టి ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.

ఆగస్టు 15వ తేదీతో కూడిన ఈ ప్రకటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇందులో మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ప్రజా సమస్యల పరిష్కారానికి గళం విప్పుతామని స్పష్టం చేశారు.

బస్వరాజ్ మృతిపై ఆవేదన – శాంతిపథానికి మద్దతు

పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ మే 21న ఛత్తీస్‌గఢ్‌లోని గుండెకోట్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడిలో మొత్తం 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో బస్వరాజ్ ఆశయాల ప్రకారం పార్టీ శాంతి చర్చల వైపు మొగ్గు చూపిందని అభయ్ ప్రకటించారు.

కేంద్రంతో చర్చలకు సిద్ధమన్న మావోయిస్టులు

శాంతి చర్చల కోసం నెల రోజులపాటు కాల్పుల విరమణ ప్రకటించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు. దేశ ప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా తాము ఆయుధాలను వదలాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి తాము సిద్ధమని, తమ అభిప్రాయ మార్పు గురించి పార్టీకి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. పార్టీకి ఈ అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొనే సహచరులతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్న సహచరులు, జైళ్లలో ఉన్న వారితో సంప్రదించేందుకు తమకు నెల రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించి, గాలింపు చర్యలను నిలిపివేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని అభయ్ లేఖలో వివరించారు.

ప్రజలతో ప్రత్యక్ష కమ్యూనికేషన్ – ఈమెయిల్, ఫేస్‌బుక్ ప్రారంభం

తమ నిర్ణయంపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు మావోయిస్టు పార్టీ తొలిసారిగా ఒక ఈమెయిల్ (nampet2025@gmail.com), ఫేస్‌బుక్ ఐడి (nampetalk)ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మావోయిస్టు చరిత్రలోనే తొలిసారి ప్రజలతో ప్రత్యక్షంగా కమ్యూనికేట్ చేయడానికి తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.

నిఘా వర్గాల స్పందన

ఈ ప్రకటనపై కొన్ని వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటనగానే భావిస్తున్నాయి. ప్రకటనలో కిషన్‌జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ముద్రించడం గమనార్హం. 

మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేస్తామని శాంతి చర్చలకు సిద్ధమని ఎప్పుడో ఆగస్ట్ 15 వ తేదీన లేఖ ద్వారా చేసిన ప్రకటన సెప్టెంబర్ నెలలో నెలరోజుల తర్వాత బయటకు రావడం ఆశ్చర్యం కల్గిస్తుంది …దేశంలో ఎర్రజెండా రాజ్యం స్థాపించాలని సోషలిజం తేవాలని అది తుఫాకీ ద్వారానే సాధ్యమని నమ్మిన నాటి పీపుల్స్ వార్ పార్టీ అనేక ఉద్యమాలను చేసింది …యూనివర్సిటీల్లో చదువుతున్న అనేకమంది విద్యార్థులు,డాక్టర్లు మేధావులు పీపుల్స్ వార్ సిద్ధాంతాలను నమ్మి వారి వెంట నడిచారు …అనేక రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను ప్రారంభించారు …ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అబుజ్ మడ్ లాంటి ప్రాంతంలో స్వపరిపాలన ఏర్పాటు చేశారు …అక్కడ స్థానిక పరిపాలన అంతా తమ చేతుల్లోకి తీసుకున్నారు …రైతు ,కూలీ,మహిళా ,గిరిజన సంఘాలు ఏర్పాటు చేశారు ..స్థానిక పంచాయతీలు ,వారికీ కావాల్సిన వైద్యం ,విద్య ,స్థానిక అవసరాలకు కావాల్సిన నిధులు సమకూర్చారు .. గిరిజనులు కూడా వారి వెంట నడిచారు …ఒక రకంగా చెప్పాలంటే వారు చెప్పిందే ఆ ప్రాంతంలో వేదంగా మారింది … గట్టి భద్రతా ,గెరిల్లా దళాలు ఏర్పాటు చేసుకున్న వారికీ ఒక చిన్న ప్రాంతం నుంచి రాజ్యంపై తిరుగుబాటు చేయడం కష్టంగా మారింది … రాజ్యంతో జరిగిన యుద్ధంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు …నిత్యం పోరులో కొత్త ఆయుధాలు ,కొత్త టెక్నాలజీ ,డ్రోన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి…దీంతో మావోయిస్టు కదలికలను కచ్చితంగా తెలుసుకొని వారిని టార్గెట్ చేస్తూ అడవుల్లో గుండ్ల వర్షం కురిపిస్తుండటంతో అనేకమంది ముఖ్యనేతలను పోగొట్టుకున్నారు ..ఈనేపథ్యంలో రాజ్యంతో యుద్ధం కొనసాగించటమా…? లేక రాజీ పడటమా ..?అనేది వారి ముందు ఉంది … దీంతో కాల్పుల విరమణ ప్రకటించడంతోపాటు ,ఆయుధాలు వదిలేస్తామని ప్రకటించడం ఒక రకంగా తమ ఓటమిని ఒప్పుకున్నట్లే లేకపోతె మరింత నష్టం జరగడం ఖాయం అని భావించారు …అందుకు కేంద్రం ఏరకంగా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది ..

కేంద్రం 2026 మార్చ్ నాటికీ మావోయిస్టులను లేకుండా ఏరివేస్తామని ప్రకటించింది …దీనిపై ప్రత్యేకించి హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో మావోయిస్టుల ఏరివేత పై ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు . అది కొనసాగుతుంది …కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూడా మావోయిస్టుల ఏరివేత ఆగదని ప్రకటించారు … మావోయిస్టుల ప్రకటన నేపథ్యంలో కేంద్ర తీసుకునే వైఖరి ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొన్నది …చూద్దాం ఏమి జరుగుతోందో…..

Related posts

జాతీయ విద్యా విధానంపై అసంతృప్తి.. బీజేపీకి తమిళ నటి రాజీనామా

Ram Narayana

2023-24లో రూ. 58,104 కోట్ల పన్నులు చెల్లించిన అదానీ గ్రూప్ కంపెనీలు

Ram Narayana

బీజేపీకి వచ్చిన విరాళాలు రూ.10,122 కోట్లు.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు రూ.300 కోట్లకు పైగా!

Drukpadam