- మంత్రుల సమాధానాలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్న బొత్స
- మంత్రి ఆనం తీరుపై తీవ్ర అసంతృప్తి
- మంత్రి పదవికి ఆనం రాజీనామా చేయాలని డిమాండ్
ఏపీ శాసనమండలిలో మంత్రులు ఇస్తున్న సమాధానాలు అత్యంత బాధ్యతారహితంగా ఉన్నాయని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యంగా దేవాలయాల భద్రతకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి వ్యంగ్యంగా బదులిచ్చారని, దీనికి నిరసనగా తాము సభను బహిష్కరించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తిరుపతి, సింహాచలం దేవస్థానాల్లో జరిగిన దురదృష్టకర ఘటనలపై తాము ప్రశ్న అడిగితే, ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేదని బొత్స విమర్శించారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయంపై కూడా హుందాతనం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. దేవాలయాల విషయంలో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన సంబంధిత మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి దేవుడి పట్ల, భక్తుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో స్పష్టమైందన్నారు.
ఇదే కాకుండా ఇతర అంశాల్లోనూ మంత్రుల వైఖరి ఇలాగే ఉందని బొత్స ఆరోపించారు. 50 ఏళ్లకే పింఛను ఇస్తామన్న హామీ గురించి అడిగితే సమాధానం దాటవేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, కల్తీ మద్యం, బెల్ట్ షాపులపై అడిగిన ప్రశ్నలకు కూడా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారని దుయ్యబట్టారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులపై చర్చిద్దామన్నా ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. మండలిలో జరిగే చర్చలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలి కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
శాసనమండలిలో మనకు బలం ఉంది: జగన్

- వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం
- మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం
- ప్రజా సమస్యలపై గళం విప్పాలని సూచన
శాసనమండలిలో పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వినియోగించుకోవాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. మండలిని వేదికగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ అధ్యక్షతన లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలకు జగన్ మార్గనిర్దేశం చేశారు.
ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని జగన్ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలని చాలామంది సలహాలిచ్చినా, కొందరు టీడీపీ సభ్యులను పార్టీలోకి లాక్కోవాలని చెప్పినా తాము అలా చేయలేదని జగన్ స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో వైసీపీకి బలం ఉందని… ఆ బలాన్ని ఉపయోగించుకొని ప్రజా సమస్యలపై గట్టిగా గళం విప్పాలని ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.