జాతీయ వార్తలు

ఆధారాలతో ‘ఓట్ల దొంగతనం’ గుట్టురట్టు చేసిన రాహుల్!

  • బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ ‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలు 
  • ఢిల్లీలో ఆధారాలతో మీడియా ముందుకు వచ్చిన ప్రతిపక్ష నేత
  • కర్ణాటకలోని అలంద్‌లో 6 వేలకు పైగా ఓట్ల తొలగింపు యత్నం
  • ఓట్ల దొంగలకు సీఈసీ రక్షణగా నిలుస్తున్నారని తీవ్ర విమర్శ
  •  ఇది ఆరంభం మాత్రమే, త్వరలో ‘హైడ్రోజన్ బాంబ్’ పేలుస్తానని వెల్లడి

దేశంలో వ్యవస్థీకృతంగా ‘ఓట్ల దొంగతనం’ జరుగుతోందని, ఈ కుట్రకు పాల్పడుతున్న వారిని సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కాసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఎలా తొలగిస్తున్నారో ఆధారాలతో వివరించారు.

కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఘటనను ఆయన ఉదాహరణగా చూపించారు. అక్కడ ఏకంగా 6,018 ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని రాహుల్ ఆరోపించారు. “ఇది అనుకోకుండా బయటపడిన ఒక ఉదంతం మాత్రమే. అలంద్‌లో మొత్తం ఎన్ని ఓట్లు తొలగించారో మాకు తెలియదు. కానీ 6,018 ఓట్ల తొలగింపు వ్యవహారం మాత్రం పట్టుబడింది” అని ఆయన తెలిపారు.

ఈ కుట్ర ఎలా బయటపడిందో వివరిస్తూ “ఒక బూత్ లెవెల్ అధికారి తన బంధువు పేరు ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంతో ఆరా తీశారు. ఆమె బంధువు ఓటును ఒక పొరుగు వ్యక్తి దరఖాస్తు ద్వారా తొలగించినట్లు రికార్డుల్లో ఉంది. ఆ పొరుగు వ్యక్తిని అడగ్గా, తనకేమీ తెలియదని, తాను ఏ దరఖాస్తు చేయలేదని చెప్పారు. అంటే, ఓటు తొలగించిన వ్యక్తికి తెలియదు, ఓటు పోగొట్టుకున్న వ్యక్తికీ తెలియదు. మధ్యలో మరేదో శక్తి ఈ ప్రక్రియను హైజాక్ చేసి ఓట్లను తొలగించింది” అని రాహుల్ వివరించారు.

ఈ సందర్భంగా బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను ఈ మాటను తేలిగ్గా అనడం లేదు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా చెబుతున్నాను. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓట్ల దొంగలకు రక్షణ కల్పిస్తున్నారు. ఇది పచ్చి నిజం, ఇందులో ఎలాంటి గందరగోళం లేదు” అని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

గతంలో తాను చెప్పినట్లుగా త్వరలోనే ‘హైడ్రోజన్ బాంబ్’ లాంటి బలమైన సాక్ష్యాలను బయటపెడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈరోజు చూపించింది కేవలం దాని ట్రైలర్ మాత్రమేనని, అసలు విషయం ముందుందని ఆయన పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో ఓట్లు తొలగించలేరు.. కేంద్ర ఎన్నికల సంఘం

Election Commission Denies Rahul Gandhis Voter List Claims
  • ఓటర్ల జాబితాపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం
  • ఆన్‌లైన్‌లో ఓట్లు తొలగించడం అసాధ్యమని స్పష్టీకరణ
  • ప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఈసీ వ్యాఖ్య
  • కర్ణాటక అలంద్‌లో అక్రమాలను తామే బయటపెట్టామన్న ఈసీ
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాహుల్ మాట్లాడుతున్నారని ఈసీ వ్యాఖ్యానించింది.

ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ విధానంలో ఓట్లను నేరుగా తొలగించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఓటరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుని, క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాకే జాబితా నుంచి పేరును తొలగించడం జరుగుతుందని వివరించింది. ఈ ప్రక్రియ లేకుండా ఓట్లను తొలగించడం కుదరదని స్పష్టం చేసింది.

కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు జరిగిందన్న రాహుల్ ఆరోపణలపై కూడా ఈసీ స్పందించింది. వాస్తవానికి, 2023లో ఆ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను గుర్తించి, బయటపెట్టిందే తామని గుర్తుచేసింది. ఓట్ల తొలగింపునకు కొందరు ప్రయత్నించిన ఘటనపై తామే స్వయంగా కేసు నమోదు చేయించి ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని తెలిపింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. అలంద్‌లో ఘటన జరిగి ఏడాది గడిచిందని, కానీ జ్ఞానేశ్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టి కేవలం ఆరు నెలలే అవుతోందని ఈసీ వర్గాలు గుర్తుచేశాయి. సంబంధం లేని విషయంలో ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డాయి.

Related posts

ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో అనిల్ అంబానీ పేరు… సంచలన విషయాలు వెల్లడి!

Ram Narayana

మణిపూర్ లో రాహుల్ కాన్వాయ్ ను ఆపేసిన పోలీసులు…

Drukpadam

114 ఏళ్ల మారథాన్ పరుగుల వీరుడు రోడ్డు ప్రమాదంలో మృతి

Ram Narayana